Kalki 2898 AD show cancelled in PVR Panjagutta due to heavy rainfall: రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ' చూద్దామని ఆదివారం సాయంత్రం సరదాగా పీవీఆర్ థియేటర్‌కు వెళ్లిన ఫ్యాన్స్, ప్రేక్షకులకు చుక్కలు కనిపించాయి. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురవడం కాదు... థియేటర్ లోపల నిజంగా వర్షం కురిసింది. దాంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు కంగు తిన్నారు. కాసేపు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురి అయ్యారు. ఆ తర్వాత షో క్యాన్సిల్ కావడంతో తీరిగ్గా బయట పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే...
పీవీఆర్ పంజాగుట్టలో వర్షం కురిసింది!
హైదరాబాద్ సిటీలో ఆది వారమంతా వాతావరణం చల్లగా ఉంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, చిరుజల్లులు పడ్డాయి. చీకటి పడ్డాక భారీ కుండపోత వర్షం కురిసింది. ఆ వర్షం ప్రభావం 'కల్కి 2898 ఏడీ' సినిమాపైనా పడింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పీవీఆర్ పంజాగుట్టకు వెళ్లిన ప్రేక్షకులు ప్రభాస్ సినిమా పూర్తిగా చూడకుండా మధ్యలో వెనుదిరగాల్సి వచ్చింది.
నగరంలో కురిసిన భారీ వర్షాలకు పీవీఆర్ పంజాగుట్ట థియేటర్ పైకప్పు డ్యామేజ్ అయ్యింది. దాంతో థియేటర్ లోపలకు వర్షపు నీరు కురిసింది. తమ మీద నీరు పడటంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఏమీ అర్థం కాలేదు. చివరకు, ఆ షో క్యాన్సిల్ చేసి మధ్యలో ప్రేక్షకుల్ని బయటకు పంపించారు.
థియేటర్ మైంటైన్ చేసే పద్ధతి ఇదేనా?
థియేటర్ లోపల వర్షం కురవడంతో పీవీఆర్ పంజాగుట్ట యాజమాన్యం మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువ మొదలైంది. ఆ వర్షపు నీటికి షార్ట్ సర్క్యూట్ అయితే పరిస్థితి ఏంటి? అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరొక నెటిజన్ అయితే పీవీఆర్ పూర్ మెయింటెనెన్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోస్ చూసి జనాలు సైతం షాక్ అవుతున్నారు.
వెయ్యి కోట్లు వచ్చాక నాగ్ అశ్విన్ తీరు మారిందా?
'కల్కి 2898 ఏడీ' భారీ విజయం సాధించింది. వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ చేరడమే కాదు, పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ విజయం పట్ల ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు లేనిదే తాను లేనని చెప్పారు. మరోవైపు సోషల్ మీడియాలో దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. బ్లడ్, వయలెన్స్ లేకుండా వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమా అని ఆయన పేర్కొనడంతో సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' మీద సెటైర్లు వేశారని కొందరు భావిస్తున్నారు.