మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్‌లో 'చూడాలని ఉంది' సినిమా కూడా ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌందర్య, అంజలా జవేరి హీరోయిన్స్ గా నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇక మణిశర్మ అందించిన పాటలైతే అప్పట్లో చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఆగస్టు 27, 2023 నాటికి ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా 'కాళికా'(కాళీ దేవత) అని పెట్టినట్లు గుణశేఖర్ తెలిపారు.


'చూడాలని ఉంది' లాంటి సాఫ్ట్ టైటిల్ చిరంజీవి లాంటి హీరోకి ఎలా సూట్ అవుతుందని యాంకర్ గుణశేఖర్ ని ప్రశ్నించాడు. దీంతో ఈ చిత్రానికి తాను పేరు పెట్టలేదని, ఆ టైటిల్‌ని చిరంజీవే సూచించారు’’ అని గుణశేఖర్ వెల్లడించారు. ‘‘ఈ సినిమాకి మొదట్లో 'కలకత్తా' లేక 'కాలిక' అనే పేరు పెట్టాలని అనుకున్నాం. కానీ మేము వీటి కంటే ఇంకా విభిన్నమైన టైటిల్స్ కోసం చూస్తున్నాం. ఇది క్లాస్ టచ్ తో కూడిన యాక్షన్ చిత్రం కాబట్టి 'సొగసు చూడతరమా' లాంటి టైటిల్ ని పెట్టాలని అనుకున్నాం. అది కాకుండా 'చూడాలని ఉంది' అనే టైటిల్ అయితే బాగుంటుందా? అని చిరంజీవి నన్ను అడిగారు. అప్పుడు నేను మెగాస్టార్ ఇమేజ్ కి అది సరిపోదేమో అని కంగారు పడ్డాను. కానీ అందరూ ఈ టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పారు. దాంతో అదే టైటిల్ తో ముందుకు వెళ్లాం" అంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చారు.


ఇక ఆ తర్వాత సినిమాలో అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ లవ్ సీన్ గురించి కూడా పంచుకున్నారు. "రైల్వే స్టేషన్లో ఆ సీన్ సుమారు పది నిమిషాలు ఉంటుంది. చిరంజీవికి అసలు డైలాగ్స్ ఉండవు. ఆయన స్టేషన్లో చైర్ మీద కూర్చుని అమ్మాయిని చూస్తుంటారు. చిరంజీవికి డైలాగులు లేకుండా ఒక నిమిషం పాటు సన్నివేశాన్ని నడపడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది అంతసేపు ఆ సీన్ షూట్ చేశాం. ఈ సీన్ చేయడానికి నాంపల్లి, కాచిగూడ స్టేషన్స్ కావాలని నిర్మాతను నేను అడిగితే నిర్మాత అశ్వనీదత్ గారు షాక్ అయిపోయారు. ఎందుకంటే అప్పట్లో నాంపల్లి స్టేషన్ చాలా పెద్దది. అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. మూడు రోజులు చిరంజీవి గారిని పెట్టుకుని షూట్ చేయడం చాలా కష్టం. పైగా ఆయనతో షూటింగ్ అంటే రైల్వే శాఖ కూడా అనుమతి ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ షూటింగ్ జరిగితే రైళ్లు ఆగిపోతాయి. ప్రయాణికులు ఇబ్బంది పడతారు. టైమింగ్స్ మారిపోతాయి. దాంతో అతి కష్టం మీద రైల్వే శాఖ అనుమతి లభించింది. రైల్వే స్టేషన్లో షూటింగ్ జరుగుతుండగా చాలామంది రైళ్లు ఎక్కకుండా స్టేషన్ లోనే ఆగిపోయారు" అంటూ గుణశేఖర్ పేర్కొన్నారు. 


Also Read : సమంత ఫేవరేట్ హీరోని నేనే - ఆమె చీటింగ్ కూడా బాగా చేస్తుంది: విజయ్ దేవరకొండ





Join Us on Telegram: https://t.me/abpdesamofficial