సినీ తారలకు సంబంధించి కొత్త విషయాలను తెలుసుకునేందుకు జనాలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. వారికి సంబంధించిన ఏ విషయం అయినా సరే, సోషల్ మీడియాలోకి వచ్చిందంటే, క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన పాత ఫోటోల చూసేందుకు చాలా ఇష్టపడతారు. తమ అభిమాన తారలు చిన్నప్పుడు ఇలా ఉన్నారా? అని ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడప్పుడు హీరో, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చేస్తూనే ఉంటాయి.


పాత ఫోటోలను అభిమానులతో పంచుకున్న తేజ


ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక అబ్బాయిని ఎత్తుకుని ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ చిన్నోడు ఎవరు? అని నెటిజన్లు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయితే, ఈ ఫోటోల్లో ఉన్నది మరెవరో కాదు, యంగ్ హీరో తేజ సజ్జ. కేవలం మూడు సంవత్సరాల వయసులోనే చిరంజీవి సినిమాలో నటించాడు. చక్కటి నటనతో ప్రేక్షకులను అలరించాడు. చిన్నోడి నటనకు చిరంజీవి ఎంతో సంతోషపడ్డారు. విజయోత్సవ సభలో అతడిని ఎత్తుకుని అభిమానులకు పరిచయం చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలను తేజ సజ్జ ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు. ఆగష్టు 27తో ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టి 25 ఏండ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా తన తొలి సినిమాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. తన సినీ జర్నీని గుర్తు చేసుకున్నాడు.






వయసు 28 ఏండ్లు, సినీ అనుభవం 25 ఏండ్లు!


చిరంజీవి హీరోగా  దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘చూడాలని ఉంది’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు తేజ. ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఈ సినిమా విజయోవత్స సభ సమయంలో చిరంజీవి తేజను ఎత్తుకుని అభిమానులకు చూపించాడు. ఈ ఫోటోను తేజ షేర్ చేస్తూ తన సినీ ప్రయాణం గురించి అభిమానులతో పంచుకున్నాడు. “25 ఏండ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. ఇప్పుడు ఈ సినీ పరిశ్రమ నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఒక లెజెండ్ పక్కన పరిచయం అయిన నేను, ఇప్పుడు ‘హనుమాన్’ వరకు చేరుకున్నాను. ఇదంతా నాకు ఒక కలగా అనిపిస్తోంది. చిరంజీవి గారూ, గుణశేఖర్ గారు, అశ్వినీదత్ గారు నా కలను నిజం చేశారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ప్రస్తుతం 28 ఏళ్లు, నా సినీ అనుభవం 25 ఏళ్లు” అని వెల్లడించాడు. మూడు సంవత్సరాల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన తేజ, చిరంజీవితో పాటు మహేష్ బాబు, పవన్ కల్యాణ్ సహా పలువురి స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు.  ప్రస్తుతం తేజ సజ్జ ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.  ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది(2024) జనవరి 12న విడుదల కానుంది.


Read Also: బొట్టు, సింధూరం, మంగళసూత్రం.. భారతీయ మహిళలకు వీరే స్ఫూర్తి - కంగనా కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial