చంద్రయాన్ 3 సక్సెస్‌పై ఎందరో సినీ సెలబ్రిటీలు స్పందించారు. అయితే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మాత్రం వారికంటే కొంచెం భిన్నంగా స్పందించింది. ‘చంద్రయాన్ 3’ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా సైంటిస్టులను ప్రశంసలతో ముంచెత్తింది.


నిజమైన ఫెమినిజం..
చంద్రయాన్ 3 లాంచ్, ల్యాండింగ్.. ఇలా అన్ని సమయాల్లో లేడీ సైంటిస్టుల ఫోటోల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రయోగం వెనుక చాలామంది మహిళా సైంటిస్టుల కృషి కూడా ఉంది. చాలామంది ఈ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ఇదే నిజమైన ఫెమినిజం’ అంటే అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు.. భారతీయ మహిళలకు వీరే స్ఫూర్తి అని ప్రశంసించారు. సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. రాజకీయనాయకులు, సినీ సెలబ్రిటీలు, మరెందరో ప్రముఖులు కూడా ఈ మహిళలు చేసిన కృషిని మెచ్చుకున్నారు. అదే విధంగా కంగనా కూడా వీరి గురించి పోస్ట్ చేసింది.


ఇదే భారతీయతకు నిదర్శనం
‘ఇండియాలో మెరుగైన సైంటిస్టులు అందరూ బొట్టు, సింధూరం, మంగళసూత్రంతో సాంప్రదాయకంగా ఉన్నారు. ఇది సాధారణ జీవనానికి, మెరుగైన ఆలోచనా విధానానికి, భారతీయతకు నిదర్శనం’ అని మహిళా సైంటిస్టుల ఫొటోలను షేర్ చేసింది కంగనా రనౌత్. కంగనాకు ఏదైనా నచ్చకపోతే.. ఎంత ఘాటుగా సమాధానమిస్తుందో.. తను దేనినైనా ఇష్టపడితే.. అదే విధంగా ఓపెన్‌గా చెప్పేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత మహిళలు ఏదైనా ధృడంగా ఏదైనా చేయాలని కోరుకుంటే వారిని ఆపడం కష్టమని ఇస్రో సైంటిస్టుల గురించి తన స్పీచ్‌లో ప్రత్యేకంగా తెలిపారు.


ఉమెన్ పవర్‌కు నిదర్శనం..
చంద్రుడిలోని సౌత్ పోల్‌పై మొదటిసారి ల్యాండ్ అయిన శాటిలైట్‌గా ఇస్రో చంద్రయాన్ 3 రికార్డ్ సాధించింది. ఆగస్ట్ 23న అనుకున్న స్థానంలో చంద్రయాన్ 3 సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయ్యింది. అమెరికా, చైనా, ఒకప్పటి సోవియెట్ యూనియన్ తర్వాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తున్న నాలుగో దేశంగా ఇండియా పేరు సాధించింది. చంద్రయాన్ 3 మిషన్ ల్యాండింగ్ సైట్‌ను ‘శివ శక్తి పాయింట్’ అని పేరు పెడుతున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. చంద్రయాన్ 3ను ఉమెన్ పవర్‌కు మంచి ఉదాహరణ అని ఆయన తెలిపారు. కేవలం ఆయనకు మాత్రమే కాదు చాలామంది భారతీయులు అభిప్రాయం కూడా అదే.


ప్రస్తుతం కంగనా 'చంద్రముఖి 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పి వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, ప్రభు, వడివేలు ప్రధాన పాత్రల్లో వచ్చిన 'చంద్రముఖి' సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సీక్వెల్లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు లీడ్ రోల్స్ చేస్తున్నారు. లక్ష్మీ మీనన్, రాదికా శరత్‌కుమార్, మహిమా నంబియార్, రావు రమేష్, విఘ్నేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్ అండ్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 19న ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read: ఆ హీరో చనిపోయిన ఇంట్లోకి ఆదా శర్మ - కొనేయడానికి సిద్ధం?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial