కేరళ స్టోరీ’ సినిమాతో హిట్ కొట్టిన ఆదా శర్మ.. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉందట. ఇంతకీ ఆ ఇల్లు మరెవ్వరిదో కాదు.. ఆత్యహత్య చేసుకుని చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌ది. ఇటీవల ఆదా ఇంటికెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు ఆమెను ఆ ఇల్లు కొనుగోలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇందుకు ఆమె సమాధానం చెబుతూ.. ‘‘చెప్పాల్సిన సమయంలో తప్పకుండా చెబుతాను. మీ అందరికీ స్వీట్లు ఇస్తా’’ అని తెలిపింది. దీంతో ఆదా ఆ ఇల్లు కొనేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. 


సుశాంత్ మరణించింది ఆ ఇంట్లోనే


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబయిలోని బంద్రాలోని మౌంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్‌లోని రెండు అంతస్థుల భవనంలో నివాసించేవాడు. అయితే, అది ఆయన సొంత భవనం కాదు. నెలకు రూ.4.5 లక్షలు అద్దె చెల్లించేవాడు. 2020, జూన్ 14న ఆ ఇంట్లోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉంటోంది. పోలీసుల క్లియరెన్స్ లభించిన తర్వాత 2021 నుంచి ఆ ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు యజమాని ప్రయత్నిస్తున్నారు. సుశాంత్ మరణం తర్వాత ఆ ఇంటి అద్దెకు రూ.5 లక్షలకు పెంచేశారు. పైగా, ఆ ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎవరూ అద్దెకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఆదా శర్మ ఆ ఇంటికెళ్లడం చర్చనీయమైంది. అది సముద్ర తీరంలో ఉన్న బంగ్లా కావడంతో చాలా ఖరీదు ఉంటుందని, మరి ఆదా దాన్ని అద్దెకు తీసుకుంటుందా, లేదా కొనుగోలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 






ఇటీవలే ఆదాకు ఆయుర్వేద చికిత్స


ఇటీవల ఆదా డయేరియాకు గురైంది. ఒళ్లంతా దద్దుర్లతో తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరింది. ఎంతకీ పరిస్థితి మెరుగుకాకపోవడంతో అదా ఆయుర్వేద చికిత్సను ఆశ్రయించింది. ఈ సందర్భంగా కొద్ది రోజులు సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అదా పరిస్థితి చూసి ఆందోళనకు గురైన ఆమె తల్లి కూడా గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. ఇంటర్వ్యూలు, షూట్‌లకు బ్రేక్ ఇచ్చి, విశ్రాంతి తీసుకోవాలని అమ్మ చెప్పిందని అదా పేర్కొంది. ‘‘నేను త్వరలోనే తిరిగి వస్తా. అప్పటి వరకు నేను ‘కమాండో’ సీరిస్‌లోని సన్నివేశాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేస్తూనే ఉంటాను’’ అని తెలిపింది. అయితే, ట్రోలర్స్ మాత్రం.. ఆమెకు పంచ్‌లు వేస్తున్నారు. ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్తున్నావా? అని అంటున్నారు. కేరళ ప్రజలు నీ మీద కోపంగా ఉన్నారు జాగ్రత్త అని కొందరు అంటున్నారు. చివరికి నీకు కేరళనే దిక్కయ్యిందని మరికొందరు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం అదాకు మద్దతు తెలుపుతున్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే అలా ఎలా ట్రోల్ చేస్తారని కామెంట్లు చేస్తున్నారు. 


Also Read: ‘నాటు నాటు’ సింగర్స్‌పై కొరియన్ పాప్ స్టార్స్ ఆసక్తికర వ్యాఖ్యలు - ఆ ఛాన్స్ కొట్టేస్తారా?