కొన్ని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించినా.. అవార్డులు అందుకోలేకపోతాయి. కొన్ని మాత్రం అటు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంతో ఇటు అవార్డులను కూడా మూటగట్టుకుంటాయి. అలాంటి పాటల్లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ కూడా ఒకటి. నేషనల్ వైడ్‌గా మాత్రమే కాదు.. ఈ పాటకు ఇంటర్నేషనల్ వైడ్‌గా కూడా అవార్డులు దక్కాయి. తెలుగు సినిమాను, తెలుగు ప్రేక్షకులను ఈ పాట ఎంతో గర్వపడేలా చేసింది. ‘నాటు నాటు’కు అంత క్రేజ్ రావడానికి కేవలం ఎన్‌టీఆర్, రామ్ చరణ్ మాత్రమే కాదు.. ఆ పాటను కంపోజ్ చేసిన ఎమ్ఎమ్ కీరవాణి, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కూడా కారణమే. అందుకే కాలభైరల, రాహుల్‌కు ఏకంగా కొరియా నుండే సెన్సేషనల్ ఆఫర్ దక్కింది.


కాలభైరవ, రాహుల్‌తో పనిచేయాలనుంది..
కొరియన్ పాప్ బాండ్స్‌కు ఇండియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. కొరియన్ సినిమాలు, సిరీస్‌లు, పాటలు, అక్కడి బ్యాండ్స్ పర్ఫార్మెన్స్‌లు.. వీటన్నింటికి చాలామంది ఇండియన్, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే పూర్తిగా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం కొరియాకు సంబంధించిన ఎన్నో పాప్ బ్యాండ్స్‌కు ఇండియాలో ఆదరణ ఉంది. అందులో ఒక బ్యాండ్ ‘మస్ట్‌బీ’. తాజాగా ఈ బ్యాండ్ సభ్యులు.. కాలభైరవతో, రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి పనిచేయాలని ఉందంటూ ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇటీవల ఢిల్లీలో పర్ఫార్మ్ చేయడానికి వచ్చిన ‘మస్ట్‌బీ’.. అక్కడే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. 


‘నాటు నాటు’ పాటకు కొరియన్ సింగర్స్ స్టెప్పులు..
ఆగస్ట్ 25న ఇండియాకు, కొరియాకు మధ్య ఉన్న దౌత్య సంబంధాలు మొదలయ్యి 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేయాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. దీనికోసం ప్రముఖ కొరియన్ పాప్ బ్యాండ్ ‘మస్ట్‌బీ’కు ఇండియాలో పర్ఫార్మ్ చేయాలని ఆహ్వానం లభించింది. ఈ ఆహ్వానాన్ని మన్నించి వారు కూడా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో  ‘మస్ట్‌బీ’తో పాటు ప్రముఖ సింగర్ నీతి మోహన్ కూడా పాల్గొన్నారు. ఇందులో ‘మస్ట్‌బీ’ తమకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన ‘రష్’, ‘రియలైజ్’ అనే రెండు పాటలను పాడారు. దీంతో పాటు బీటీఎస్ ‘పర్మిషన్ టు డ్యాన్స్’ పాటను కూడా పాడి ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేశారు. అంతే కాకుండా ‘నాటు నాటు’ స్టెప్ కూడా వేశారు.


2019లో బ్యాండ్ ప్రారంభం..
పర్ఫార్మెన్స్ తర్వాత ‘మస్ట్‌బీ’ బ్యాండ్‌కు చెందిన అయిదుగురు సింగర్స్ – టెజియాన్, వ్యూయియాన్, దోహా, సూహ్యూన్, సిహో.. తమతో పాటు కార్యక్రమంలో పాల్గొన్ని నీతి మోహన్‌తో పాటు ఆస్కార్ విన్నింగ్ ‘నాటు నాటు’ పాటను పాడిన కాలభైరవ, రాహుల్‌తో కలిసి పనిచేయాలని ఉందంటూ తమ మనసులోని మాటను బయటపెట్టారు. అంతే కాకుండా వారు అమీర్ ఖాన్ నటించిన ‘3 ఇడియట్స్’ చిత్రాన్ని చూశామని చెప్పారు. 2019లో మొదటిసారి ప్రేక్షకులకు తమ పాటను వినిపించిన ‘మస్ట్‌బీ’.. ముందుగా ఏడుగురితో మొదలయ్యింది. ఆ తర్వాత మెల్లగా అయిదుగురితో ఫేమస్ అయ్యింది. కొరియా నుంచి సైతం సింగర్స్ వచ్చి ఇక్కడి వారితో కలిసి పనిచేయాలనుంది అంటూ తమ ఇష్టాన్ని బయటపెట్టడం.. ఇండియన్ సినిమాకే గర్వకారణం అని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఇక వారు అనుకున్నట్టుగానే త్వరలోనే కాలభైరవ, రాహుల్ కలిసి ఈ బ్యాండ్‌తో ఏమైనా ఆల్బమ్ ప్లాన్ చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


Also Read: 'అఖండ 2'పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి - బాలకృష్ణ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే స్పీచ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial