పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులలో హీరో నితిన్ (Nithiin) కూడా ఒకరు. ఆ విషయాన్ని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. 'గుండెజారి గల్లంతయ్యిందే'లో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా 'తొలిప్రేమ'లో 'ఏమైందో ఈ వేళ' పాటను రీమిక్స్ చేశారు. ఇప్పుడు కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే... 


నితిన్ హీరోగా 'తమ్ముడు'... నేడు షురూ!
నితిన్ కథానాయకుడిగా ఈ రోజు కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు నిర్మించనున్న చిత్రమిది. ఆ సంస్థలో 56వ చిత్రమిది. దీనికి 'తమ్ముడు' (Thammudu Movie) టైటిల్ ఖరారు చేశారు.


''కొన్ని టైటిళ్లతో పాటు చాలా బాధ్యతను మోసుకుని వస్తాయి'' అని నితిన్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ టైటిల్ తన సినిమాకు పెట్టుకోవడం చాలా బాధ్యతతో కూడిన విషయమని ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది. ప్రేక్షకుల అంచనాలను మించి తాము సినిమా తీస్తామని ఆయన వెల్లడించారు.


Also Read : 'అఖండ 2'పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి - బాలకృష్ణ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే స్పీచ్!






'వకీల్ సాబ్' తర్వాత ఆ దర్శకుడి నుంచి...
'తమ్ముడు' టైటిల్ మాత్రమే కాదు, ఈ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నితిన్ చెంతకు వచ్చారు. ఆయన కూడా పవర్ స్టార్ అభిమానే. 'వకీల్ సాబ్' తర్వాత వేణు శ్రీరామ్ చేస్తున్న చిత్రమిది. 


'తమ్ముడు' సినిమా ప్రారంభోత్సవంలో దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, 'దిల్' రాజు కుమార్తె హన్షిత తదితరులు పాల్గొన్నారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ... నితిన్, వేణు శ్రీరామ్, 'దిల్' రాజులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 


Also Read మొగుడిని మిర్చిలా నంజుకుతింటున్న పెళ్ళాం - సమంతను తిడుతూ విజయ్ దేవరకొండ పాట


దర్శకుడిగా పరిచయమైన 'ఓ మై ఫ్రెండ్', 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'వకీల్ సాబ్'... 'దిల్' రాజు నిర్మాణ సంస్థలోనే వేణు శ్రీరామ్ సినిమాలు చేశారు. ఇప్పుడీ 'తమ్ముడు'ను కూడా ఆ సంస్థలో చేస్తున్నారు. 'దిల్', 'శ్రీనివాస కళ్యాణం' తర్వాత 'దిల్' రాజు నిర్మాణ సంస్థలో నితిన్ చేస్తున్న మూడో చిత్రమిది. ''రక్త సంబంధం కంటే అనుబంధం బలమైనది. కొత్త తమ్ముడు వస్తున్నాడు'' అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పేర్కొంది.



ఇప్పుడు నితిన్ చేస్తున్న సినిమాలకు వస్తే... వక్కంతం వంశీ దర్శకత్వంలో, సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' చేస్తున్నారు. అందులో శ్రీ లీల కథానాయిక. క్రిస్మస్ కానుకగా ఆ డిసెంబర్ 23న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కాకుండా తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అందులోనూ శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. 


'దిల్' రాజు విషయానికి వస్తే... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్' తెరకెక్కిస్తున్నారు. నృత్య దర్శకుడు యశ్ హీరోగా ఆయన నిర్మాణ సంస్థలో 'ఆకాశం దాటి వస్తావా'తో పాటు మరికొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial