సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'జైలర్‌'. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ట్రైలర్, సాంగ్స్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఈ సినిమా.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఫలితంగా 72 ఏళ్ళ వయసులో రజనీ తనశైలి డైలాగులు, స్టైల్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా మరికొన్ని రికార్డును బద్దలు కొట్టారు.


ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జైలర్‌’ సినిమా.. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 580 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందులో తమిళ వెర్షనే 450 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసి, కోలీవుడ్ సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సృష్టించిందని తెలుస్తోంది. అన్ని భాషల్లో వసూళ్లను పరిగణలోకి తీసుకుంటే మాత్రం 2.0 మూవీ (₹615–₹800 కోట్లు) ఇండస్ట్రీ హిట్‌గా మిగిలిపోతుంది.


‘జైలర్‌’ సినిమా తమిళనాడులో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల్లో రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న నాన్‌ సీక్వెల్‌ ఇండియన్‌ మూవీగా మరో రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటి వరకు సీక్వెల్ సినిమాలైన ‘కేజీఎఫ్‌ 2’, ‘బాహుబలి 2’ మాత్రమే ఈ ఘనత సాధించాయి. 


ఇలా తలైవా న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుండటంతో ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వయసులో రజనీ ఒక బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టి, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తే చాలని అనుకుంటే, ఊహించని విధంగా ఇండస్ట్రీ రికార్డ్ సాధించడంతో ఖుషీ అవుతున్నారు. ట్రెండ్ చూస్తుంటే రానున్న రోజుల్లో మరికొన్ని రికార్డులు ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు దాదాపు పుష్కర కాలం తర్వాత భారీ సక్సెస్ దక్కడంతో, సూపర్ స్టార్ సైతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. శుక్ర‌వారం రాత్రి చిత్ర బృందంతో కలిసి పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.


నిజానికి 'రోబో' తర్వాత రజనీకాంత్ ఆ స్థాయి హిట్టు అందుకోలేదు. మధ్యలో ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ సినిమాలు బాగానే ఆడినప్పటికీ తలైవా రేంజ్ బ్లాక్ బస్టర్స్ సాధించలేదు. గతేడాది వచ్చిన 'పెద్దన్న' డిజాస్టర్‌గా మారడంతో రజనీ పనైపోయిందని, సినిమాలకు సెలవు ప్రకటించాల్సిన టైమొచ్చిందని కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు 'జైలర్' తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అలాంటి విమర్శలు చేసిన వారందరికీ సమాధానం చెప్పారు తలైవా. 


'జైలర్' చిత్రంలో రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించగా, తమన్నా భాటియా స్పెషల్ రోల్ లో మెరిసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్, కన్నడ చక్రవర్తి శివ రాజ్‌ కుమార్, హిందీ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ పోషించిన అతిధి పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వసంత్ రవి, మిర్నా మీనన్, వినాయకన్, సునీల్‌, యోగిబాబు తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించారు. రజనీతో పాటు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ నిర్మల్ ఎడిటర్ గా వర్క్ చేసారు. 


Also Read: Nandi Awards: రచ్చ గెలిచాం, ఇంట గెలవలేమా? నంది అవార్డులు అటకెక్కినట్లేనా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial