చిత్రా శుక్లా (Chitra Shukla), ఆదర్శ్, చరిష్మా ప్రధాన తారలుగా రూపొందిన చిత్రం 'గీత సాక్షిగా' (Geeta Sakshigaa Movie). చేతన్ రాజ్ కథ అందించడంతో పాటు చేతన్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. మార్చి 22న సినిమా విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. అందులో కథాంశం ఏమిటన్నది క్లారిటీగా చెప్పేశారు. అయితే, అసలు దోషి ఎవరనేది చెప్పకుండా ప్రేక్షకులను సస్పెన్సులో ఉంచారు.
అమ్మాయిని హత్య చేసింది ఎవరు?
Geetha Sakshigaa Trailer Review : 'గీత సాక్షిగా' ట్రైలర్ చూస్తే... లేడీస్ హాస్టల్‌లో అమ్మాయి హత్య జరుగుతుంది. ఆ కేసులో అమ్మాయి లవర్ / హీరోను అరెస్ట్ చేస్తారు. అతని తరఫున వాదించడానికి యువ మహిళా న్యాయవాది చిత్రా శుక్లా ముందుకు వస్తారు. అమ్మాయి హత్యకు కారణమైన హీరోకి శిక్ష పడాలని సమాజం కోరుతుంది. అతడి కేసు టేకప్ చేసినందుకు చిత్రా శుక్లా మీద ఇంక్ చల్లుతారు. ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందన్నది సినిమా కథాంశం.
హీరో హత్య చేయలేదని, అతడిని కేసులో ఇరికించినట్టు 'గీత సాక్షిగా' ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అసలు, అమ్మాయిని హత్య చేసింది ఎవరు? హీరోని కేసులో ఎందుకు ఇరికించారు? జైలులో ఉన్న యువకుడితో న్యాయవాది ప్రేమలో ఎలా పడ్డారు? అనేవి ఆసక్తి కలిగించే అంశాలు. సభ్య సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే విధంగా సినిమా తీశామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇదొక ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా అని చెప్పారు. సినిమా కోసం ఆదర్శ్ సిక్స్ ప్యాక్ చేశారు.
Also Read : రామ్ చరణ్ ఆస్కార్ డ్రస్ వెనుక కథ - అల్లూరి స్ఫూర్తితో, మిలటరీని రిప్రజెంట్ చేసేలా
ఇటీవల విడుదల చేసిన 'ఎవరు నువ్వు...' పాట కూడా మహిళలపై మృగాళ్ల అకృత్యాలను ప్రశ్నించేలా ఉంది.
''యుగాలుగా ఈ పుడమిపై జరుగుతున్న ఘోరం...
చరిత్ర పుటలు తడిసి పారుతున్న రక్తస్రావం...
జగానికి అంత జన్మనిచ్చు పెంచు తల్లి దేహం...
మృగాల చేతిలోన నెలకొరుగుతుంది నిత్యం...''
అంటూ సాగిన ఈ గీతాన్ని విజయ్ ఏసుదాస్ ఆలపించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. రెహమాన్ రాశారు. సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను ఆయన గట్టిగా ఎండగట్టారు. మృగాళ్లను నిలదీశారు.
''ఎవరు నువ్వు తెలుసా మనిషి? నెలలు మోసి కడుపు కోసి కన్న నలుసువి, మనిషి విలువ మరిచి పశువై బలిసి మగువ మీద మదము చూపే జన్మ దేనికి?'' అంటూ సమాజానికి, ముఖ్యంగా మగాళ్లకు రెహమాన్ ప్రశ్నలు సంధించారు. మహిళలపై అఘాయిత్యాలను ప్రశ్నించిన గొప్ప పాటల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుంది.
Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్
శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ (Gopi Sundar Music Director) స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ, ఎడిటర్: కిశోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నృత్యం : యశ్వంత్ - అనీష్, ఫైట్స్ : పృథ్వీ, సమర్పకులు : పుష్పక్, JBHRNKL.