రెబల్ స్టార్ ప్రభాస్ ఆరోగ్యం (Prabhas Health) గురించి కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొంది. ఆయన ఈ మధ్య తరచూ అనారోగ్యం కారణంగా షూటింగులు క్యాన్సిల్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ గుసగుస. ముందుగా అనుకున్న విధంగా షెడ్యూల్స్ ప్రకారం మారుతి దర్శకత్వంలో చేస్తున్న హారర్ కామెడీ గానీ, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' గానీ షూటింగ్స్ జరగడం లేదు. ఈ తరుణంలో ప్రభాస్ ఫారిన్ టూర్ న్యూస్ అభిమానులకు కాస్త ఆందోళన కలిగించేదని చెప్పాలి.
విదేశాల్లో హెల్త్ చెకప్ కోసం...
ఇప్పుడు ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. హెల్త్ చెకప్ కోసమే కొన్ని రోజులు షూటింగులకు బ్రేక్ ఇచ్చి వెళ్లారని టాక్. అభిమానులు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇది రెగ్యులర్ హెల్త్ చెకప్ అని ప్రభాస్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
షూటింగులకు బ్రేక్!?
కొన్నాళ్ళ పాటు షూటింగులకు ప్రభాస్ వచ్చే అవకాశం లేదని ఇండస్ట్రీ గుసగుస. హెల్త్ కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. 'బాహుబలి' కోసం బరువు పెరగడం, ఆ తర్వాత తగ్గడం, మధ్యలో 'సాహో' లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడం కారణంగా ఆరోగ్యం విషయంలో ప్రభాస్ కొన్ని సమస్యల బారిన పడ్డారని చిత్రసీమ వర్గాల కథనం.
ఇటీవల ఇండియాలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన ప్రభాస్ వైద్యుల సూచన మేరకు షూటింగులకు విరామం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు సంబంధించిన షెడ్యూల్స్ అన్నింటిని కూడా రద్దు చేశారట. ఇప్పుడు ఏకంగా విదేశాలకు వెళ్లారు. ఫిబ్రవరిలో కూడా జ్వరం కారణంగా మారుతి సినిమా షూటింగ్ కొన్ని రోజులు క్యాన్సిల్ చేశారు.
Also Read : ఆస్కార్ వచ్చినట్లు బన్నీకి తెలియదా? లేదంటే కావాలని కంగ్రాట్స్ చెప్పలేదా?
ప్రభాస్ హెల్త్ 'ప్రాజెక్ట్ కె' విడుదలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతోంది. అమితాబ్ బచ్చన్ కూడా గాయపడటం కారణంగా షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. వాళ్లిద్దరూ కోలుకుంటేనే గానీ షూటింగ్ చేయడానికి లేదు. ఆల్రెడీ 'ఆదిపురుష్' షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రకటించిన తేదీకి సినిమా వస్తుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనేది థియేటర్లలోకి సినిమా వస్తే తప్ప తెలియదు. 'సలార్' విడుదల సంగతి ఏమిటనేది ఇంకా క్లారిటీ లేదు.
Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్
జనవరి 12, 2024లో 'ప్రాజెక్ట్ కె'ను విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ (Deepika Padukone) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపై రానటువంటి కథాంశంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోందని టాక్.
'ప్రాజెక్ట్ కె' కంటే ముందు రెండు రిలీజులు!
'ప్రాజెక్ట్ కె' కంటే ముందు ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్', 'సలార్' ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' ఈ ఏడాది జూన్ 16న విడుదల కానుంది. 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' సెప్టెంబర్ 28న విడుదల కానుంది.