Dusshera 2024: టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత సమ్మర్ ను సినిమాలకు అతి పెద్ద సీజన్ గా భావిస్తుంటారు. కానీ ఈసారి వేసవిలో పెద్ద హీరోల సందడి పెద్దగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ఉండటం, కొన్ని స్టేట్స్ లో లోక్ సభ ఎలక్షన్స్ ఉండటంతో మేకర్స్ సినిమాల రిలీజుల విషయంలో వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. దీనికి ఐపీఎల్ క్రికెట్ టోర్నీ మరో ప్రధాన కారణమని టాక్. ఇప్పటికైతే 'కల్కి 2898 AD' ఒక్కటే ఈ సీజన్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న భారీ చిత్రం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. ఇప్పటికీ చెప్పిన సమయానికే వస్తాం అంటున్నారు కానీ, వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. త్వరలలోనే దీనిపై క్లారిటీ రానుంది.


ఈ సంగతి అటుంచితే, సమ్మర్ లో పెద్ద సినిమాల విడుదలు లేకపోవడంతో టాలీవుడ్ లో ఈసారి దసరాకి తీవ్ర పోటీ ఏర్పడుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో రాబోయే అతి పెద్ద సీజన్ కోసం అనేక క్రేజీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య లాంటి ముగ్గురు స్టార్ హీరోలు విజయ దశమి కోసం కర్చీఫ్స్ వేశారు. ఈ క్రమంలో ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా 2024 ఫెస్టివల్ రేసులోకి రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.


పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రాన్ని సెప్టెబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'అత్తారింటికి దారేది' సెంటిమెంట్ తో అదే డేట్ కు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. దసరా పండుగ రోజు వరకూ బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. పవన్ ఇంకో రెండు వారాల డేట్స్ ఇస్తే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.


ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న మాస్ యాక్షన్ మూవీ 'దేవర'. ఈ సినిమా మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. చివరకు అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దసరా సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. RRR తర్వాత తారక్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే బయటకి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'తండేల్'. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ను దసరా పండక్కి ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు స్పష్టం చేశారు. దీని కోసం అక్టోబరు 11వ తేదీని ఫిక్స్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో  టాక్ నడుస్తోంది. ఫెస్టివల్ సీజన్ కాబట్టి రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చినా ఇబ్బంది ఉండదని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు ఆడియెన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. 


నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ మూవీని కూడా దసరాకే రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని కోసం OG, 'దేవర' పార్ట్ 1 మధ్యలో అక్టోబర్ 3వ తేదీని పరిశీలిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైతే ఈ విషయంలో మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి దృవీకరణ లేదు. కాకపోతే బాలయ్య దసరా సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకొని బరిలో దిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.


Also Read: ఉపాసన కాళ్లు నొక్కిన రామ్ చరణ్!