Eesha Rebba About Chances For Telugu Girls: ఇండస్ట్రీలో రోజులు మారుతున్నాయని ఎవరు ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ టాలీవుడ్‌లో కూడా సరిపడా తెలుగమ్మాయిలు లేరు. ఇప్పుడిప్పుడు తెలుగమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయని చెప్పినా.. వేరే భాషల హీరోయిన్లను సినిమాల్లో క్యాస్ట్ చేసుకోవడానికే దర్శకులు ఇష్టపడుతున్నారు. దీనిపై ఈషా రెబ్బ స్పందించింది. ఈషా.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి పదేళ్లు అయ్యింది. అయినా కూడా తనకు తగినంత గుర్తింపు రావడం లేదు. దీనిపై కూడా ఈషా రెబ్బ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ ఎంతైనా ఓటీటీ అనేది వచ్చిన తర్వాత రోజులు మారాయని సంతోషం వ్యక్తం చేసింది.


సమానంగా అవకాశాలు కావాలి..


‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అయితే ఇండస్ట్రీలో తెలుగు మాట్లాడే అమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది అయ్యారు. కోవిడ్, ఓటీటీ తర్వాత దర్శకులు, నిర్మాతలు తెలుగమ్మాయిలను క్యాస్ట్ చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం. ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగమ్మాయిలను ప్రిఫర్ చేయరు అని నేను ముందు కూడా చాలాసార్లు చెప్పాను. వేరే భాషల్లో వెళ్లి పనిచేయడంలో తప్పేం లేదు. వేరేవాళ్లు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. అలా సమానమైన అవకాశాలు ఉంటే బాగుంటుంది కదా’’ అని చెప్పుకొచ్చింది ఈషా రెబ్బ.


కాళ్లకు అద్దుకొని తీసుకుంటారు..


‘‘వేరే భాషా ఇండస్ట్రీల్లో భాష తెలిసిన అమ్మాయిని కళ్లకు అద్దుకొని తీసుకుంటారు. నేను వేరే భాషల్లో కూడా ఆడిషన్స్ ఇచ్చాను. కానీ అక్కడ నాకు ఎంతవరకు భాష వస్తుందనే చూశారు. అక్కడ మనకు భాష అస్సలు రాదు అనగానే మొహాలు మాడిపోతాయి. భాష రాని అమ్మాయిని తీసుకుంటే కష్టమవుతుంది అనుకుంటారు. నేను మలయాళంలో ఒక సినిమా చేశాను. కానీ అక్కడ ఇంకొక సినిమా చేయాలంటే భాష వచ్చినవారినే తీసుకుంటారు అని డైరెక్ట్‌గా చెప్పేస్తారు. నేను తమిళంలో మ్యానేజ్ చేస్తాను, నాకు మలయాళం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. అక్కడ ఒక సీన్ కోసం 2,3 టేక్స్ తీసుకున్నా అంటే మొహాలు చూసుకునేవారు. భాష వచ్చిన అమ్మాయిని తీసుకుంటే బాగుండేది అనే విషయం వాళ్ల మొహంలో అర్థమయ్యేది’’ అని టాలీవుడ్, మాలీవుడ్‌కు ఉన్న తేడాను చెప్పింది ఈషా.


అక్కడే సెటిల్ అయిపోతారు..


‘‘హిందీలో కూడా అంతే. మనం మాట్లాడే హిందీలో సౌత్ టచ్ ఉంది అంటే సినిమాలోని క్యారెక్టర్ అలాంటిది అయితేనే మనల్ని తీసుకుంటారు. హిందీలో యాడ్ షూట్‌కు కూడా ఆడిషన్ చేయాలి. తెలుగులో కొందరు దర్శకులు మాత్రమే యాడ్స్‌కు ఆడిషన్స్ చేస్తారు. అందుకే చాలామంది అమ్మాయిలు వేరే భాషల నుంచి వచ్చి ఇక్కడ చాలా సినిమాలు చేసిన తర్వాత వాళ్ల భాషకు వెళ్లిపోతారు. అక్కడే సెటిల్ అయిపోతారు. వేరే భాషల్లో ఉన్నట్టు భాష తెలిసిన వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వమని కూడా నేను అనడం లేదు. కానీ సమానమైన ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది’’ అంటూ వేరే భాష నటీమణులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై స్పందించింది ఈషా రెబ్బ.


Also Read: ‘అరవింద సమేత’ మూవీని ఫస్ట్ రిజక్ట్ చేశా, త్రివిక్రమ్ అలా చెప్పడంతో ఒప్పుకున్నా, కానీ..: ఈషా రెబ్బ