Actor Naresh About His Mother Vijaya Nirmala: సీనియర్ నటుడు నరేష్ తన తల్లి విజయ నిర్మల, కృష్ణ గురించి కీలక విషయాలు వెల్లడించారు. వారిద్దరి మధ్య ప్రేమ చాలా గొప్పగా ఉండేదని చెప్పారు. కృష్ణ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆమె సమర్థించేదన్నారు. ఇంటి గుట్టును ఇద్దరు ఏనాడు బయటపెట్టలేదని వెల్లడించారు. “కృష్ణ గారితో అమ్మ చాలా ప్రేమగా ఉండేది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ అనేది. ఒకవేళ ఇద్దరి మధ్యన ఏదైనా అర్గ్యుమెంట్ వస్తే, అందరి ముందట చర్చ జరిగేది కాదు. పైన వాళ్లిద్దరు, నాలుగు గోడల మధ్యే జరిగేది. చివరకు ఇద్దరు ఒకే అనుకున్నాకే కిందికి వచ్చే వాళ్లు. ఇద్దరు లెజెండ్స్. కృష్ణ గారు ఓ లెజెండ్. అమ్మ కూడా లెజెండ్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. వాళ్లిద్దరు ఇంటిగుట్టు ఏనాడు బయట పెట్టుకోలేదు. ఇద్దరు చర్చించుకుని నిర్ణయం తీసుకునే వాళ్లు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను నేను వివరించలేను. ఆయనను ఆమె ఒక దేవుడిలా చూసేది. వారి జంట అందరికీ ఆదర్శం. వాళ్ల ప్రేమను చూసి చాలా మంది ఆశ్చర్యపోయే వాళ్లు” అని చెప్పుకొచ్చారు.


చివరి రోజుల్లో చాలా మానసిక వేదనకు గురయ్యింది - నరేష్ 


అమ్మ విజయ నిర్మల చివరి రోజుల్లో చాలా మానసిక ఆవేదనకు గురైందని నరేష్ వెల్లడించారు. కృష్ణ గురించి ఆలోచిస్తూ బాధపడేదని చెప్పారు. “అమ్మ చివరి రోజుల్లో చాలా మానసిక బాధకు గురయ్యింది. కృష్ణగారి గురించి ఆలోచిస్తూనే ఆవేదన పడేది. చనిపోవడానికి ముందు నడవడానికి కూడా ఇబ్బంది పడింది. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయింది. తాను లేకపోయినా కృష్ణ గారిని బాగా చూసుకోవాలని చెప్పింది. ఆయన ఇబ్బంది పెట్టకూడదని కంటతడి పెట్టింది. ఆమె బాధను చూసి నాకూ ఏడుపు వచ్చింది. ఆమె తన బాధను కనిపించకుండా కృష్ణ గారితో సంతోషంగా ఉండేది. నవ్వుతూ మాట్లాడేది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం అనేది కష్టం అయిపోయింది. కానీ, ఆమె ఉన్నంత కాలం మేమంతా ఉమ్మడి కుటుంబంలా ఉన్నాం. కృష్ణగారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అని వేరుగా ఉండేది కాదు. అందరం కలిసి ఉండేవాళ్లం. మహేష్ అంటే అమ్మకు చాలా ఇష్టం” అని వివరించారు.


అమ్మ నన్ను ఏనాడు కొట్టలేదు- నరేష్


అమ్మ విజయ నిర్మల తనను ఏనాడు కొట్టలేదని నరేష్ చెప్పారు. అమ్మను చూస్తే చిన్నప్పుడు చాలా భయం వేసేదని చెప్పారు. కానీ, ఎప్పుడూ ఆమె కొట్టేది కాదన్నారు. నేను అల్లరి పనులు చేసినా, భయపెట్టేది తప్ప చెయ్యెత్తేది కాదన్నారు. అమ్మ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. అమ్మ మీద ఉన్న ప్రేమ తనకు మరేదాని మీద లేదన్నారు. నన్ను ఎంతో అపురూపంగా పెంచిన ఆమెను, చివరి రోజుల్లో దగ్గరుండి చూసుకున్నట్లు నరేష్ వివరించారు.


 Read Also: ఆధ్య, అకీరాకు నేను ఇచ్చింది అదే - వాళ్లు ఏం నిలబెట్టుకుంటారో చూడాలి: పవన్ కల్యాణ్