యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ 'ప్రాజెక్ట్ కె'. మహానటి విజయం తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే కథానాయిక. ఆమెకు తోడు ఇంకొక బాలీవుడ్ బ్యూటీ కూడా సినిమా ఉన్నారు. ఆమె ఎవరో కాదు దిశా పటానీ.
'ప్రాజెక్ట్ కె' సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని దిశా పటానీ ఇన్ డైరెక్టుగా వెల్లడించారు. శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె ఒక పోస్ట్ చేశారు. అందులో 'ప్రాజెక్ట్ కె' చిత్ర బృందం దిశా పటానీలో వెల్కమ్ చెబుతున్న గ్రీటింగ్ కార్డ్ ఉంది. దాంతో అసలు విషయం తెలిసింది.
తెలుగు ప్రేక్షకులకు దిశా పటానీ తెలిసిన అమ్మాయే. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లోఫర్'లో కథానాయికగా నటించారు. అయితే, ఆ తర్వాత ఆమె హిందీ సినిమాలపై ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. పాన్ ఇండియా సినిమా 'ప్రాజెక్ట్ కె'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, ఇందులో ఆమె పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆల్రెడీ ప్రభాస్, దీపికా పదుకోన్ 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇటీవల షూటింగులో దిశా పటానీ కూడా జాయిన్ అయ్యారు.
'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతోందని తెలిసింది.
Also Read: నాకు బాగా దగ్గరున్నోళ్లు దూరమయ్యారు - ‘సర్కారు వారి పాట’ ఈవెంట్‌లో మహేష్ బాబు భావోద్వేగం