సర్కారు వారి పాట సినిమాలో తనకు, కీర్తి సురేష్‌కు మధ్య ట్రాక్ బాగా వచ్చిందని మహేష్ బాబు అన్నారు. దాని కోసం సినిమా మళ్లీ మళ్లీ చూస్తారని తెలిపారు. శనివారం జరిగిన సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ ఈ మాటలు అన్నారు. అయితే స్పీచ్ చివర్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు.


ఈ సందర్భంగా మహేష్ బాబు‘రెండు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని (అభిమానులను) చూడటం ఆనందంగా ఉంది. ముందుగా పరశురామ్‌కు థ్యాంక్స్ చెప్పాలి. నా క్యారెక్టర్ ఎక్స్‌ట్రార్డినరీగా డిజైన్ చేశారు. ఇది నా ఫేవరెట్ క్యారెక్టర్లలో ఒకటి. నా డైలాగ్ డెలివరీ, మ్యానరిజం పూర్తిగా ఆయనే డిజైన్ చేశారు. కొన్ని సీన్లలో నటించేటప్పుడు పోకిరి రోజులు గుర్తొచ్చాయి.’


‘సర్కారు వారి పాట సినిమా ఒప్పుకున్నాక పరశురామ్ ఇంటికి వెళ్లి నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఈ సినిమా ఇరగదీసేస్తాను అన్నారు. పరశురామ్‌కి థ్యాంక్స్. నాన్న అభిమానులకు, నా అభిమానులకు మీరు ఫేవరెట్ డైరెక్టర్ అవుతారు. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి. హీరో, హీరోయిన్ ట్రాక్ నా ఫేవరెట్ ట్రాక్. దీని కోసం రిపీట్ ఆడియన్స్ వస్తారు.’


‘కీర్తి సురేష్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెస్ చాలా కొత్తగా ఉంటాయి. గత రెండేళ్లలో ఎన్నిసార్లు డేట్లు అడిగినా తను ఇచ్చింది. తనకు థ్యాంక్స్. ఎందుకొచ్చిందో తెలీదు కానీ నాకు, థమన్‌కి చాలా గ్యాప్ వచ్చింది. కానీ నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. కళావతి ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. దానికి పూర్తి క్రెడిట్ థమన్‌కే. థమన్ నాకు సోదరుడి లాంటి వాడు. దానికి తనకు థ్యాంక్స్.’


‘రామ్, లక్ష్మణ్ మాస్టర్లు హీరోను ఎంత బాగా చూసుకుంటారో, ఫైటర్లను కూడా అంతే బాగా చూసుకుంటారు. అందుకే నంబర్ వన్ అయ్యారేమో. శేఖర్ మాస్టర్‌కు కూడా థ్యాంక్స్. మైండ్ బ్లాక్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలుసు. ఈ సినిమాలో డ్యాన్స్‌లు దానికి మించి ఉంటాయి. ఈ సినిమాకు పనిచేసిన మిగతా టీం మొత్తానికి చాలా థ్యాంక్స్. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మాతలు నాకు బ్లాక్‌బస్టర్లు ఇచ్చారు. ఈ సినిమా మా కాంబినేషన్‌లో మరో మెమరబుల్ బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఈ రెండేళ్లలో చాలా మారాయి. నాకు బాగా దగ్గరైన వ్యక్తులను కోల్పోయాను. కానీ (అభిమానులను ఉద్దేశించి) మీ అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ముందుకు వెళ్లిపోవడానికి. మే 12వ తేదీ మీకు అందరికీ నచ్చే సినిమా రాబోతుంది.’ అంటూ స్పీచ్‌ను ముగించారు. అభిమానుల గురించి చెప్పే సమయంలో మహేష్ కాస్త ఎమోషనల్ అయ్యారు.