సాధారణంగా క్రికెట్‌లో టాస్ వేసి ఫస్ట్ బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్‌ను నిర్ణయిస్తారు. అయితే, ఈ విధానం ఒక్కోసారి ఎన్నికల్లో కూడా బాగానే వర్కవుట్ అవుతుందనే సంగతి మీకు తెలుసా? యూకేలోని స్థానిక ఎన్నికల్లో ఇటీవల కాయిన్ టాస్ ద్వారా నాయకుడిని ఎన్నుకున్నారు. మౌన్‌మౌత్‌షైర్ కౌంటీ కౌన్సిల్ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు సరైన మెజారిటీ రాలేదు. దీంతో టాస్ వేసి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. 


యూకేలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే సంఖ్యలో ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే కాయిన్ టాస్ ఉపయోగించి విజేతను నిర్ణయిస్తారు. లేబర్‌ పార్టీకి చెందిన బ్రయోనీ నికల్సన్, కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన టోమోస్ డేవిస్‌లకు 679 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో నికల్సన్, డేవిస్‌లు టాస్ వేయడానికి అంగీకరించారు. టాస్‌లో డెవిస్‌నే విజయం వరించింది. దీంతో నికల్సన్ ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోక తప్పలేదు. 


దీనిపై నికల్సన్ స్థానిక మీడియాతో స్పందిస్తూ.. ‘‘దీనిపై నేను ఏం చెప్పగలను? అంతా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉంటే కాయిన్ టాస్ వరకు వెళ్లేంది కాదు. స్పష్టమైన మెజారిటీ వచ్చేది’’ అని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం లేబర్ పార్టీకి రాజీకీయంగా పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు.


ఇండియాలో ఏం చేస్తారు?: ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఇద్దరు అభ్యర్థుల మధ్య పొత్తు ఏర్పడితే విజేతను నిర్ణయించే అవకాశాలుంటాయి. ఒక్కోసారి లాటరీ ద్వారా కూడా ఎంపిక చేయొచ్చని చట్టం చెబుతోంది. ఇటీవల అసోంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆరు చోట్ల టాస్ వేసి విజేతలను ప్రకటించారు. ఈ ఆరు స్థానాల్లోనూ ఫలితాలు టై అయ్యాయి.


Also Read: భూమి తిరగడం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త 


ఫిబ్రవరి 2017లో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కి జరిగిన ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. బీజేపీకి చెందిన అతుల్ షా వార్డ్ నంబర్ 220 నుంచి లాటరీ ద్వారా గెలిచారు. తొలుత ఓట్ల లెక్కింపు సమయంలో అతుల్ షా శివసేన అభ్యర్థి సురేంద్ర బగల్కర్ చేతిలో ఓడిపోయారు. షా ఈ ఫలితాన్ని సవాలు చేస్తూ ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్ చేశారు. ఓట్లను తిరిగి లెక్కించగా, అది టై అయినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరూ ఒకే సంఖ్యలో ఓట్లు సాధించారు. ఓట్లను మరో రెండుసార్లు లెక్కించారు. కానీ ఫలితం టైగానే ఉంది. దీంతో విజేతను లాటరీ ద్వారా నిర్ణయించారు. చివరికి అతుల్ షా గెలిచారు. 


Also Read: అతడి అంగాన్ని చేతికి కుట్టేసిన వైద్యులు, కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!