Vijaya Bhaskar About Nuvvu Naaku Nachav: కొన్ని సినిమాలు, అందులోని కొన్ని సీన్స్.. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. పైగా అదే ఇంపాక్ట్‌తో నవ్విస్తాయి కూడా. అలాంటి సినిమాల్లో విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒకటి. త్రివిక్రమ్ రైటర్‌గా, విజయ్ భాస్కర్ డైరెక్టర్ తెరకెక్కిన ప్రతీ సినిమాకు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి ఇప్పటికీ నవ్వుకుంటారు. అందులో ఒకటైన ‘నువ్వు నాకు నచ్చావ్’లో డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయింది. ఆ సీన్ గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు దర్శకుడు విజయ భాస్కర్. ఆ సీన్ ఉన్నది 5 నిమిషాలే అయినా 5 నెలలు షూట్ చేశామని చెప్పారు.


మూడు షెడ్యూల్స్..


‘నువ్వు నాకు నచ్చావ్’లో డైనింగ్ టేబుల్ దగ్గర ఆర్టిస్టులంతా కూర్చోవడం, అప్పుడే ప్రకాశ్ రాజ్.. తన తల్లి గురించి కవిత చదవడం.. ఈ కామెడీ సీన్‌ను ఎన్నిసార్లు చూసినా ప్రేక్షకులకు నవ్వు ఆగదు. అంతే కాకుండా ఈ సీన్‌పై ఇప్పటికీ మీమ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఆ 5 నిమిషాల సీన్ కోసం మూవీ టీమ్ అంతా ఎంత కష్టపడిందో తాజాగా బయటపెట్టారు విజయ భాస్కర్. ‘‘ఆ డైనింగ్ టేబుల్ సీన్ గురించి మీకొక విషయం చెప్పాలి. అది అయిదుసార్లు తీసిన సీన్. ఒకవేళ షెడ్యూల్స్ పరంగా చెప్పాలంటే మూడు షెడ్యూల్స్‌లో ఆ సీన్ తీశాం’’ అంటూ ఆ ఎవర్‌గ్రీన్ సీన్ గురించి చెప్పుకొచ్చారు విజయ భాస్కర్.


ఫిల్మ్ ఛాంబర్‌తో సమస్య..


‘‘ఒక షెడ్యూల్‌లో ఆర్తి అగర్వాల్ ఉంది. తను అమెరికా వెళ్లిపోవాలి అందుకే ముందు తన షాట్స్ తీసి పంపించేశాం. తర్వాత ప్రకాశ్ రాజ్‌కు ఫిల్మ్ ఛాంజర్‌తో ఏదో సమస్య వచ్చింది. అది క్లియర్ అయిన తర్వాత ఆయన షాట్స్ తీశాం. తర్వాత సునీల్ షాట్స్ తీశాం. అప్పటికే సునీల్ బిజీ అయిపోయాడు. అందుకే తను ఉన్నప్పుడే వాళ్ల కాంబినేషన్ షాట్స్ పూర్తిచేశాం. అలా అయిదుసార్లు ఇద్దరు కెమెరామెన్‌తో తీసిన సీన్ అది. ముందుగా అందరి క్లోజ్ షాట్స్ తీశాం. అది అయిపోయింది. ఆ తర్వాత మరో నెల ఎమ్ ఎస్ నారాయణ, వెంకటేశ్ కలిసున్న క్లోజ్‌ షాట్స్ తీశాం. అయిదుసార్లు తీసింది అంతా కలిపితే ఆ సీన్ అలా వచ్చింది’’ అని వివరించారు విజయ భాస్కర్.


కెమెరామ్యాన్ మారారు..


తెరపై చూసే 5 నిమిషాల సీన్ కోసం ఇద్దరు కెమెరామెన్ కూడా మారడానికి కారణమేంటో విజయ భాస్కర్ బయటపెట్టారు. ‘‘ముందు ఉన్న కెమెరామ్యాన్ రవి.. జూనియర్ ఎన్‌టీఆర్ సినిమా కోసం వెళ్లిపోయాడు. అందరి ఆర్టిస్టుల డేట్స్ దొరికాయి కానీ కెమెరామ్యాన్ విజయనగరంలో షూటింగ్‌లో ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్తే నాకు స్వయంవరం చేసిన కెమెరామ్యాన్‌ను తీసుకొని మిగిలిన రెండు షాట్స్ పూర్తిచేశాం. అలా అయిదు నెలల పట్టింది ఆ సీన్ పూర్తిచేయడానికి. ఒక నెలలో రెండు షాట్స్, ఒక నెలలో ఒక షాట్ అలా చేశాం. ఒకేసారి చేసిన సీన్ కాదు’’ అని తెలిపారు. దీంతో 5 నిమిషాల సీన్ వెనుక అంత కష్టం ఉందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.


Also Read: ఓటీటీల్లో ఈ వారం పండగే.. ఏకంగా 20 సినిమాలు, సీరిస్‌లు