Actor Suman About Pawan Kalyan: గత కొంతకాలంగా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయాని, ఇది మంచి పద్దతి కాదని అభిప్రాయపడ్డారు సీనియర్ నటుడు సుమన్. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అనే విషయాన్ని గుర్తించాలని సుమన్ సూచించారు. సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రోజా లాంటి నాయకుల మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు.


పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు ఆయన వ్యక్తిగత విషయం


గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మంది దారుణం కామెంట్స్ చేశారని ఆయన గుర్తు చేశారు. “పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడ్డం సరికాదు. ముగ్గురు పెళ్ళాలు కాదు, 30 మంది పెళ్లాలను చేసుకోవచ్చు. అది ఆయన వ్యక్తిగత విషయం. నీకేంటి బాధ. వాళ్లు ఏమైనా కంప్లైంట్ చేశారా? వాళ్లు మిమ్మల్ని ఏదైనా సాయం అడిగారా? మీరు పొలిటికల్ గా మాట్లాడితే ఫర్వాలేదు. కానీ, వ్యక్తిగతంగా వెళ్లడం మంచిది కాదు. మీ పార్టీలో ఉన్నవాళ్లకు కూడా చాలా వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వారికి కూడా చాలా మంది భార్యలు ఉన్నారు. అదే విషయాన్ని ఎదుటి వాళ్లు మాట్లాడితే ఎలా ఉంటుంది?” అని సుమన్ ప్రశ్నించారు.


రోజా గురించి నాకు బాగా తెలుసు


రోజా పైనా పలువురు దారుణ వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు సుమన్. “రోజా గురించి కూడా కొంత మంది కాంట్రవర్శియల్ కామెంట్స్ చేశారు. ఒక మహిళ సినిమా పరిశ్రమలో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంతో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆవిడ బోల్డ్ గా మాట్లాడుతుంది. అందరిలా సైలెంట్ గా ఉండాలంటే ఎలా? మహిళలను గౌరవించాలి. అన్ని పార్టీల వారికి అదే వర్తిస్తుంది” అన్నారు.


రజనీకాంత్ పై దారుణ వ్యాఖ్యలు చేశారు


ఎన్టీఆర్ జయంతిలో పాల్గొని రజనీకాంత్ చంద్రబాబు నాయుడు విజన్ గురించి ప్రశంసించడం పట్ల కొన్ని పార్టీల నాయకులు విమర్శలు చేయడాన్ని సుమన్ తప్పుబట్టారు. “రజనీకాంత్ గారు.. చాలా రియాలిటీ పర్సన్. ఆయన ఎప్పుడూ నిజాన్నే మాట్లాడుతారు. ఎవరినీ అనవసరంగా పొగడరు. తను ఎక్కడి నుంచి వచ్చారో అస్సలు మర్చిపోరు. ఆయన ఎన్టీఆర్ జయంతి వేడుకలో పాల్గొని.. చంద్రబాబు విజన్ గురించి మాట్లాడితే చాలా మంది అడ్డగోలుగా వ్యాఖ్యానించారు. ఇది సరైన పద్దతి కాదు. అందుకే ఆయనకు సపోర్టుగా మాట్లాడాను” అని చెప్పారు.


వ్యక్తిగత విషయాలు మాట్లాడ్డం సరికాదు


తాను రాజకీయాల్లో లేకపోయినా, సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణిస్తున్నారని సుమన్ చెప్పారు. వాళ్లందరూ మంచి పొజిషన్ కు రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారంటే సంతోషంగానే ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లో రాణించాలని ఉన్న వాళ్లు ఎదుటి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి కాకుండా ఇష్యూ మీద మాట్లాడటం మంచిదన్నారు.


Read Also: సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ, చేతులు కలిపిన దిగ్గజ నిర్మాణ సంస్థలు