SDGM Movie Announcement: ‘వీర సింహారెడ్డి‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలయ్య నటించిన ఈ సినిమా బ్లాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న గోపిచంద్ మలినేని మరో క్రేజీ న్యూస్ చెప్పారు. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో కలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని యాక్షన్ మూవీని తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటించారు.


ఒక్కటైన దిగ్గజ నిర్మాణ సంస్థలు


సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ పాన్ ఇండియన్ మూవీకి ‘SDGM’ అనే వర్కింట్ టైటిల్ పెట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెలుగు అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్నాయి. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ కి సంబంధించిన అనౌన్స్‌ మెంట్ పోస్టర్‌ ను ఆవిష్కరించాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. 






సంగీత దర్శకుడిగా తమన్ ఫిక్స్


ఈ క్రేజీ ప్రాజెక్టుకు టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించబోతున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలను చూసుకోబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో నటీనటులు, టెక్నికల్ టీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ మూవీతోనే గోపీచంద్ మలినేని హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.


ఇక బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ రీసెంట్ గా ‘గదర్ 2’ మూవీతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమీషా పటేల్,  ఉత్కర్ష్ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రూ. 550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అటు దర్శకుడు గోపీచంద్ మలినేని చివరగా తెరకెక్కించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. బాలయ్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్లు వసూళు చేసింది. బాలయ్య కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించింది. హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు.


Read Also: కోట్ల విలువైన బంగళా, విలాసవంతమైన కార్లు- ‘యానిమల్’ బ్యూటీ నికర ఆస్తుల విలువెంతో తెలుసా?