Best Thriller Movies On OTT: ఒక సైకో.. ప్రేమలో పడితే ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అలాంటి వాటిలో ఒకటి ‘సీక్రెట్ ఆబ్సెషన్’ (Secret Obsession). ఇందులో విలన్.. హీరోయిన్ ప్రేమ కోసం ఎంత దూరం వెళ్తాడు, ఏమేం చేస్తాడు అనేది చూసి ప్రేక్షకులకే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అనుక్షణం థ్రిల్లింగ్‌గా సాగే ఒక సైకో ప్రేమకథ ఇది.


కథ..


‘సీక్రెట్ ఆబ్సెషన్’ కథ విషయానికొస్తే.. సినిమా మొదలవ్వగానే హీరోయిన్ జెన్నీఫర్ (బ్రెండా సాంగ్) ఒక వ్యక్తి దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అప్పుడే తనను ఒక కారు వచ్చి ఢీకొడుతుంది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన జెన్నీఫర్‌ను చూడడానికి తన భర్త రయాన్ (మైక్ వోగెల్) వస్తాడు. అప్పుడే జెన్నీఫర్ తన గతాన్ని మర్చిపోయిందని డాక్టర్ చెప్తుంది. దీంతో రయాన్ వెళ్లి జెన్నీఫర్‌కు తమ పెళ్లి ఫోటోలను చూపిస్తాడు. తను కాస్త బెటర్ అవ్వగానే ఇంటికి తీసుకెళ్తాడు. యాక్సిడెంట్ కేసు అవ్వడంతో డిటెక్టివ్ ఫ్రాంక్ పేజ్ (డెనీస్ హెయిస్బర్ట్) రంగంలోకి దిగుతాడు. తనకు ఇది కేవలం యాక్సిడెంట్ కేసు మాత్రమే కాదని బలంగా అనిపిస్తుంది. జెన్నీఫర్, రయాన్ ఇంటికి వెళ్లిన తర్వాతి రోజే ఫ్రాంక్.. రయాన్‌కు ఫోన్ చేస్తాడు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు రమ్మంటాడు. కానీ రయాన్ వస్తా అని చెప్పి రాడు. దీంతో ఫ్రాంక్‌కు మరింత అనుమానం కలుగుతుంది. హాస్పిటల్ నుంచి జెన్నీఫర్ వివరాలు కనుక్కోవడం మొదలుపెడతాడు. మరోవైపు రయాన్‌తో పాటు ఇంటికి వెళ్లిన జెన్నీఫర్‌కు అతడు తన భర్త కాదేమో అన్న అనుమానం మొదలవుతుంది. అందుకే తనను దూరం పెడుతుంది. 


రయాన్.. తమ బెడ్‌రూమ్‌లో కెమెరా పెట్టి మరీ జెన్నీఫర్ ఏం చేస్తుందని గమనిస్తూ ఉంటాడు. జెన్నీఫర్ వివరాలు కనుక్కోవడానికి కోసం హాస్పిటల్‌కు ఫోన్ చేస్తాడు ఫ్రాంక్. అసలు రయాన్.. తన భర్త అని ఎలా కన్ఫర్మ్ చేశారు అని అడుగుతాడు. అయితే రాయన్ వారి పెళ్లి ఫోటోలు చూపించాడని, అంతే కాకుండా జెన్నీఫర్ ప్రైవేట్ టాటూ వివరాలను చెప్పాడని చెప్తారు. దీంతో ఆ టాటూను బట్టి తన జెన్నీఫర్ ఇంటిపేరును కనుక్కొని వారి ఇంటి అడ్రస్‌ను సంపాదిస్తాడు. ఆ ఇంటికి వెళ్లి చూస్తే జెన్నీఫర్ తల్లిదండ్రులు చాలాకాలం క్రితమే హత్య చేయబడి, వారి శవాలు కుళ్లిపోయి ఉంటాయి. దీంతో రయాన్.. జెన్నీఫర్ భర్త కాదని ఫ్రాంక్‌కు కన్ఫర్మ్ అవుతుంది. మరోవైపు జెన్నీఫర్‌ కూడా రయాన్ లాప్‌టాప్‌ను సంపాదించి ఓపెన్ చేసి చూడగా.. అతడు తన భర్త కాదని తను కూడా తెలుసుకుంటుంది. దీంతో జెన్నీఫర్ తర్వాత ఏం చేస్తుంది? ఫ్రాంక్.. రయాన్‌ను పట్టుకోగలడా అన్నది తెరపై చూడాల్సిన కథ.



ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే..


‘సీక్రెట్ ఆబ్సెషన్’ సినిమా టైటిల్‌లో ఉన్నట్టుగానే ఒక వ్యక్తి.. మరో వ్యక్తిని పిచ్చిగా ఇష్టపడితే ఎంత దూరం వెళ్తాడు అనే అంశం చుట్టూనే సినిమా తిరుగుతుంది. ట్విస్ట్ అన్నీ దాదాపుగా ముందే రివీల్ అయిపోయినా ఆ తర్వాత కూడా మూవీని ఇంట్రెస్టింగ్‌గా చేయడంలో దర్శకుడు పీటర్ సల్లివాన్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు. అందుకే నటీనటులు, దర్శకుడు కలిసి ఒక మంచి థ్రిల్లర్‌ను ఆడియన్స్‌కు అందించారు. ‘సీక్రెట్ ఆబ్సెషన్’ లాంటి థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయాలనుకునేవారు నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయవచ్చు.


Also Read: మనుషులను చంపి, వారి మాంసాన్ని అమ్మే భార్యభర్తలు - ఈ ఆఫర్ వెజిటేరియన్లకు మాత్రమే!