పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మాటల మాంత్రికుడు అండ్ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఫ్రెండ్షిప్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. సినిమాలకు అతీతమైన స్నేహం వాళ్ళది. అందుకని, పవన్ అడిగిన ప్రతిసారీ త్రివిక్రమ్ పెన్ను సాయం చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆ విధంగా చేయబోతున్నారని సమాచారం.
తెలుగు చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ ప్రయాణం రచయితగా ప్రారంభం అయింది. ఆయన రాసే మాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రచయితగా సక్సెస్ వచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా మారారు. తన సినిమాలకు మాత్రమే మాటలు రాస్తూ వస్తున్న ఆయన చేత 'తీన్ మార్' కోసం డైలాగులు రాయించారు పవన్. ఆ తర్వాత మరోసారి 'భీమ్లా నాయక్' కోసం త్రివిక్రమ్ మాటలు రాయాల్సి వచ్చింది. ఇప్పుడు 'వినోదయ సీతం' కోసం కూడా డైలాగులు రాస్తున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి ఓ సినిమా చేయనున్నారు. దీనికి ప్రముఖ నటుడు, గతంలో తెలుగులో రవితేజ 'శంభో శివ శంభో' తీసిన సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా తమిళ హిట్ 'వినోదయ సీతమ్'కి రీమేక్. ఒరిజినల్ సినిమా తీసింది కూడా సముద్రఖనే. గత ఏడాది జూన్ నెలలో కొబ్బరికాయ కొట్టారు. ఈ నెలలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని అనుకున్నారు. కానీ, కుదరలేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...
సాయి మాధవ్ బుర్రా బదులు త్రివిక్రమ్!
'వినోదయ సీతం' రీమేక్ కోసం తొలుత సాయి మాధవ్ బుర్రాను మాటల రచయితగా తీసుకున్నారు. అయితే, తాను వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు మాటలు రాయలేనని ఆయన తప్పుకొన్నారట. దాంతో ఇప్పుడు ఆ బాధ్యత కూడా త్రివిక్రమ్ మీద పడింది. సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాస్తున్నారు. ఒక వైపు మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాతో పాటు ఈ సినిమా డైలాగ్ వర్క్ చేస్తున్నారట.
Also Read : వరుణ్ తేజ్ హ్యాండ్సమ్ - లావణ్య త్రిపాఠి లవ్ హింట్ ఇచ్చారా?
ఈ సినిమాలో కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు.
పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 డేస్ కేటాయించారట. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ నటించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
'వినోదయ సీతం' రీమేక్ కాకుండా... 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ సినిమా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది ఆయన నుంచి రెండు సినిమాలు రావచ్చని వినబడుతుంది. షూటింగ్ స్పీడ్ బట్టి రిలీజులు డిసైడ్ అవుతాయి.
Also Read : ఆస్కార్స్ - అమెరికా వెళ్ళిన రామ్ చరణ్