ఆరడుగుల అందగాడు, మెగా ఫ్యామిలీలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేసే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు వరుణ్ తేజ్ (Varun Tej). 'అందాల రాక్షసి'గా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వచ్చిన వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కథానాయిక, సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi). 'అంతరిక్షం', 'మిస్టర్' సినిమాల్లో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించారు.
వరుణ్ తేజ్ హ్యాండ్సమ్ - లావణ్య
వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని అప్పుడప్పుడూ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని పక్కన పెడితే... ఇటీవల లావణ్యా త్రిపాఠి ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. అవి ఏమిటి? అనే విషయానికి వస్తే...
త్వరలో లావణ్యా త్రిపాఠి డిజిటల్ తెరకు పరిచయం అవుతున్నారు. జీ5 కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన 'పులి - మేక' వెబ్ సిరీస్ (Puli Meka Web Series) లో ఆమె నటించారు. ఆ సిరీస్ బృందంతో కలిసి సుమ కనకాల (Suma Kanakala) హోస్ట్ చేస్తున్న 'సుమ అడ్డా' కార్యక్రమానికి వెళ్ళారు.
'మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు? అని అడిగితే మీరు ఎవరి పేరు చెబుతారు? ఎ) నాని, బి) వరుణ్ తేజ్?' అని సుమ కనకాల ప్రశ్న వేశారు. ''నేను వరుణ్ తేజ్ పేరు చెబుతా'' అని లావణ్యా త్రిపాఠి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ సమాధానం హైలైట్ అవుతోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి కబురు చెబుతామని అన్నట్లు నాగబాబు వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆ పెళ్లి కబురు కోసం చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు లావణ్య సమాధానంతో ఇన్ డైరెక్టుగా తమ ప్రేమ గురించి హింట్ ఇచ్చారని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ నెల 24న జీ5లో 'పులి మేక' విడుదల
'పులి - మేక' ఐపీఎస్ అధికారి కిరణ్ ప్రభ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటించిన నటించారు. ఆమె పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యువ కథానాయకుడు ఆది సాయి కుమార్ ఫోరెన్సిక్ డాక్టర్ పాత్రలో నటించారు. పోలీస్ రోల్ చేయడమే కాదు, ఇందులో లావణ్యా త్రిపాఠి మాంచి యాక్షన్ సీన్లు కూడా చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే... ఆమె యాక్షన్ సీన్లు హైలైట్ అయ్యాయి. ''లావణ్యా త్రిపాఠి ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రను 'పులి - మేక'లో చేశారు'' అని వెబ్ సిరీస్ బృందం పేర్కొంది.
Also Read : వినండోయ్ - ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ
ట్రైలర్ కంటే ముందు లావణ్యా త్రిపాఠి క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. ఎర్ర చీర కట్టి, గన్ను చేత పట్టి, ముఖానికి పసుపు రాసుకుని వీర శూర మహంకాళిలా, అమ్మోరులా కనిపించారు. అంతే కాదు... ఫైట్స్ కూడా చేశారు. వరుసగా పోలీసులను టార్గెట్ చేస్తూ సీరియల్ కిల్లర్ ను లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నారు? అనేది సిరీస్ కథ. 'పులి - మేక'కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా 'పంతం' సినిమాకు దర్శకత్వం వహించినది ఆయనే. చక్రవర్తి రెడ్డికీ ఇదే తొలి వెబ్ సిరీస్. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ (Kona Venkat) కు చెందిన కోన ఫిలిం కార్పోరేషన్ సంస్థతో కలిసి జీ 5 ఓటీటీ ఈ సిరీస్ నిర్మించింది.
Also Read : ఆస్కార్స్ - అమెరికా వెళ్ళిన రామ్ చరణ్