తెలుగు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్. ఒక్క టికెట్ మీద ఇద్దరు సినిమా చూడొచ్చు. ఈ సదావకాశాన్ని 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్ర బృందం అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే. ఇలా ఎందుకు చేస్తున్నారు? అని పూర్తి వివరాల్లోకి వెళితే...  


కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 18న థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రమిది. 'బన్నీ' వాస్ నిర్మించారు. ఇందులో కశ్మీరా పరదేశి కథానాయికగా నటించారు. మురళీ శర్మ కీలక పాత్ర పోషించారు. నంబర్ నైబర్ కాన్సెప్ట్ మీద సినిమా తీశారు. 


కథ ఏంటంటే... హీరో హీరోయిన్లు నంబర్ నైబర్ కాన్సెప్ట్ ద్వారా కలుస్తారు. తన మొబైల్ నెంబర్ చివర అంకెకు ముందు, వెనుక నంబర్స్ తీసి హీరోయిన్ కాల్ చేసినప్పుడు ఆమెకు హీరో, మురళీ శర్మ పరిచయం అవుతారు. ఆ తర్వాత ఆమె ఓ ప్రమాదంలో పడినప్పుడు... ప్రేయసిని కాపాడుకోవడం కోసం నెంబర్ నైబర్స్‌కు ఓ వీడియో ఫార్వర్డ్ చేయమని హీరో రిక్వెస్ట్ చేస్తాడు. అదీ కాన్సెప్ట్! అందుకని, ఒక టికెట్ కొంటే మీ నైబర్ సీట్ (మీ పక్క సీట్) టికెట్ ఫ్రీగా ఇస్తున్నారు.


బుధ, గురువారాల్లో ఆఫర్
బుధవారం (ఈ నెల 22), గురువారం (ఈ నెల 23) తేదీల్లో 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించింది. ఈ రోజు, రేపు ఎవరైనా సినిమాకు వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఒక్క టికెట్ మీద ఇద్దరు చూడవచ్చు. 


రెండు రోజుల్లో 5.15 కోట్లు!
'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాకు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. అన్ని ప్రీమియర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. శివరాత్రి రోజు కూడా సినిమాకు మంచి ఆదరణ కనిపించిందని, తొలి రోజు సినిమా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. రెండో రోజు కూడా వసూళ్ళు బాగా వచ్చాయి. రెండు రోజుల్లో సినిమా 5.15 కోట్లు కలెక్ట్ చేసినట్లు జీఏ2 పిక్చర్స్ వెల్లడించారు. 


Also Read : ఆస్కార్స్ - అమెరికా వెళ్ళిన రామ్ చరణ్


సినిమాలో కిరణ్ అబ్బవరం, మురళీ శర్మ, కశ్మీర మధ్య సన్నివేశాలకు మంచి పేరు వస్తోందని చిత్ర బృందం పేర్కొంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాయి. ఒక్క జానర్ అని కాకుండా సినిమాలో మల్టిపుల్ జానర్స్ టచ్ చేశారు. ఎండింగ్ అయితే థ్రిల్లర్ ఫీల్ ఇచ్చిందని ఆడియన్స్ పేర్కొంటున్నారు. 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో', '18 పేజెస్' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ సంస్థలో మరో కమర్షియల్ సక్సెస్ ఇది. 


Also Read 'శంకరాభరణం', 'బొబ్బిలి పులి' చిత్రాల ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత