ప్రతి దర్శకుడిలోనూ ఒక నటుడు ఉంటాడు. ఉండాలి కూడా! తెర మీద కనిపించేది ఆర్టిస్టులే అయినప్పటికీ... నటించేది వాళ్లే అయినా... ఎలా నటించాలో వాళ్లకు దర్శకుడు చెప్పగలగాలి కదా! చెబుతారు కదా! అందుకే ప్రతి దర్శకుడిలోనూ నటుడు ఉండడం సహజం. అయితే... తెర మీదకు దర్శకులుగా వచ్చే నటులు కొంత మంది మాత్రమే. ఆ కొంత మందిలో దర్శకుడు కిషోర్ తిరుమల (Kishore Tirumala) కూడా చేరబోతున్నారు.
'మిరాయ్'లో కీలక పాత్రలో కిషోర్ తిరుమల
'నేను శైలజ', 'ఉన్నది ఒక్కటే జిందగీ', 'చిత్రలహరి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రచయిత, దర్శకుడు కిషోర్ తిరుమల. 'నేను శైలజ' ఆయనకు గౌరవంతో పాటు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా కంటే ముందు 'సెకండ్ హ్యాండ్'తో దర్శకుడిగా మారారు కిషోర్ తిరుమల. అందులో ఆయన ఒక కీలక పాత్ర కూడా చేశారు. అయితే... సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మళ్లీ నటుడిగా కూడా కిషోర్ తిరుమల కనిపించలేదు. ఇప్పుడు ఆయనలో నటుడిని తెర మీదకు తీసుకు వస్తున్నారు కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni).
సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'మిరాయ్' (Mirai Movie). ఇందులో తేజ సజ్జ హీరో. మంచు మనోజ్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఆయనది నెగిటివ్ షేడ్స్ ఉండే యాంటీ హీరో రోల్. ఈ సినిమాలో కిషోర్ తిరుమల కీలక పాత్ర చేస్తున్నారు.
కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన 'చిత్రలహరి'కి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. ఆ సినిమా చేసేటప్పుడు దర్శకుడిలో నటుడిని సినిమాటోగ్రాఫర్ చూశారు. ఇప్పుడు తన 'మిరాయ్' సినిమాలో ఒక పాత్రకు కిషోర్ తిరుమల అయితే బాగుంటుందని కార్తీక్ ఘట్టమనేని అడగడం, ఆయన వెంటనే ఓకే చేయడం జరిగాయి. ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహమే అందుకు కారణం. కామెడీ టచ్ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్ కిషోర్ తిరుమల చేస్తున్నారు.
Also Read: ఆ దర్శకుడితో సమంత చెట్టాపట్టాల్... నాగ చైతన్యతో విడాకుల తర్వాత డేటింగ్ న్యూస్ ఇలా కన్ఫర్మ్ చేసిందా?
అశోక చక్రవర్తి రహస్యంగా దాచిన తొమ్మిది గ్రంథాల నేపథ్యంలో 'మిరాయ్' సినిమా తెరకెక్కుతోంది. వాటిని సంరక్షించే యోధుడిగా తేజ సజ్జా కనిపించనున్నారు. ఎలాగైనా సరే ఆ తొమ్మిది గ్రంథాలను సొంతం చేసుకుని భగవంతుడిగా మారాలనుకునే బ్లాక్ స్వార్డ్ అనే పాత్రలో మంచు మనోజ్ కనిపించనున్నారు. చెడుకు, మంచికి జరిగే మధ్య యుద్ధంలో ఏం జరిగిందనేది తెర మీద చూడాలి.
'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శ్రియ శరన్, జయరాం, 'లగాన్' ఫేమ్ రాజేంద్రనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ చైనీస్ భాషల్లో విడుదల కానుంది.