Dhanush's Captain Miller: నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ ధనుష్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ మూవీ 'కెప్టెన్ మిల్లర్'. ఈ పాన్ ఇండియా చిత్రానికి అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీష్, అదితి బాలన్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సీజన్ లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుని వార్తల్లో నిలిచింది. 


'కెప్టెన్ మిల్లర్' సినిమా యూకె నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డును గెలుచుకుంది.  ప్రతీ ఏడాది సినిమా, టెలివిజన్‌ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు లండన్ లోని నేషనల్ ఫిలిం అకాడమీ అవార్డులను ప్రధానం చేస్తూ వస్తోంది. 2024 సంవత్సరానికి గాను తాజాగా ప్రకటించిన అవార్డులలో ధనుష్ సినిమా ఎంపిక చేయబడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 






'కెప్టెన్ మిల్లర్' సినిమాకి అంతర్జాతీయ అవార్డు వచ్చినందుకు చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ''యూకె జాతీయ అవార్డులలో కెప్టెన్ మిల్లర్ బెస్ట్ ఫారిన్ మూవీగా అవార్డును గెలుచుకున్నందుకు థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన రచయితలలో ఒకరిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. అరుణ్‌ మాతేశ్వరన్, ధనుష్, జివి ప్రకాష్ మొత్తం టీమ్‌కి ధన్యవాదాలు'' అని లిరిసిస్ట్ మదన్ కార్కీ పోస్ట్ పెట్టారు. 






'కెప్టెన్ మిల్లర్' చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. జి.వి ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చగా.. సిద్దార్థ నూని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నాగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 2024 జనవరి 12న తమిళ్ లో విడుదలైన ఈ సినిమా.. తెలుగులో మాత్రం రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రంగా నిలిచింది. 


కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలను, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ధనుష్. రూసో బ్రదర్స్ తెరకెక్కించిన 'ది గ్రే మ్యాన్‌' సినిమాలో కీలక పాత్ర పోషించడం ద్వారా అంతర్జాతీయంగా ఖ్యాతిని పొందారు. ఇప్పుడు తన 'కెప్టెన్ మిల్లర్' సినిమా ప్రతిష్టాత్మక అవార్డును సాధించడంతో మరోసారి గ్లోబల్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'రాయన్' సినిమా ఈ నెలలోనే విడుదల కానుంది. 'కుబేర', ఇళయరాజా బయోపిక్ లు సెట్స్ మీద ఉన్నాయి. 


Also Read: ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో కమల్ హాసన్ లుక్ ఇదేనా? ఈ వైరల్ ఫొటోల వెనుక అసలు కథ ఇదీ!