ఈరోజుల్లో ఇండియన్ సినిమాల్లో కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే టెక్నాలజీ ఉంటుంది. అలా అడ్వాన్స్ టెక్నాలజీతో తెరకెక్కిన చిత్రమే ‘కల్కి 2898 AD’. ఇందులోని విజువల్స్ చూసి ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అని, టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఇలాంటి మూవీ రాలేదని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక ఇందులో ప్రతీ పాత్రకు సంబంధించిన మేక్ ఓవర్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అందులో కమల్ హాసన్ క్యారెక్టర్ డిజైన్ కూడా ఒకటి. తాజాగా యూఏఈకి చెందిన అజయ్ శ్రీకుమార్ అనే లీడ్ డిజైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ‘కల్కీ 2898 ఏడీ’లో కమల్ హాసన్ లుక్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ‘ఏబీపీ దేశం’ మీకు క్లారిటీ ఇవ్వనుంది.


కొత్తవారితో..


‘కల్కి 2898 AD’కు అలాంటి ఔట్‌పుట్ తీసుకొని రావడానికి కోసం చాలామంది యంగ్ టాలెంట్‌ను రంగంలోకి దించాడు నాగ్ అశ్విన్. ప్రతీ ఫీల్డ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్‌ను కూడా పనిలో పెట్టాడు. ప్రతీ పాత్ర డిజైనింగ్ కోసం కూడా అలాంటి ఒక టీమ్ పనిచేసింది. ‘కల్కి 2898 AD’లో నటీనటుల మేకప్, క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగుందని కూడా ఆడియన్స్ గమనించారు. ముఖ్యంగా సుప్రీమ్ యస్కిన్‌న్‌గా కమల్ హాసన్ చూడడానికి చాలా భయంకరంగా ఉండాలి. అందుకే తన మేక్ ఓవర్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది టీమ్. కానీ సినిమాలో ప్రేక్షకులు చూసిన యస్కిన్‌కి.. డిజైనర్ ముందుగా డిజైన్ చేసిన క్యారెక్టర్‌కు చాలా తేడా ఉంది.


అసలు సంగతి ఇది


‘కల్కి 2898 AD’లో యస్కిన్‌ పాత్రకు కావాల్సిన డిజైనింగ్‌ను అజయ్ శ్రీకుమార్ అనే డిజైనర్‌తో కలిసి రెడీ చేసింది తన టీమ్. సినిమాలో చూసింది కాకుండా ముందుగా ఈ పాత్ర కోసం వేరే విధంగా డిజైనింగ్ జరిగిందని, కానీ అది రిజెక్ట్ అయ్యిందని తాజాగా బయటపెట్టాడు అజయ్ శ్రీకుమార్. ఆ రిజెక్ట్ అయిన డిజైన్‌ను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. తను కొత్తవాడు అయినా కూడా తనకు ఈ అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్, కమల్ హాసన్‌కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఇక రిజెక్ట్ అయిన ఈ క్యారెక్టర్ డిజైనింగ్ చూసిన నెటిజన్లు సైతం ఇది కూడా బాగానే ఉందంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరైతే పూర్తిగా మేటర్ చదవకుండా ‘కల్కీ 2898 ఏడీ’ సీక్వెల్‌లో సుప్రీమ్ యస్కిన్ లుక్ ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు. సో.. ఇదన్నమాట అసలు సంగతి.






ట్రైలర్‌తోనే షాక్..


‘కల్కి 2898 AD’లో యస్కిన్‌గా కమల్ హాసన్ కనిపించేది కాసేపే అయినా దాని ఇంపాక్ట్ మాత్రం ఓ రేంజ్‌లో ఉండిపోయింది. ఆ పాత్ర ఇంకాసేపు ఉంటే బాగుండేది అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ విడుదలయిన తర్వాత అసలు అందులో కమల్ హాసన్ ఎక్కడ అని గుర్తుపట్టడమే ఆడియన్స్‌కు కష్టంగా మారింది. ఫైనల్‌గా ట్రైలర్ చివర్లో కనిపించింది కమల్ హాసనే అని అర్థమయిన తర్వాత ఆయన మేక్ ఓవర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అజయ్ శ్రీకుమార్ పోస్ట్ చేసిన ఈ డిజైన్స్ చూసిన తర్వాత ఈ మేక్ ఓవర్ కోసం అంత కష్టపడ్డారా అని అనుకుంటున్నారు.



Also Read: ప్రభాస్‌తో డేటింగ్? DP టాటూపై స్పందించిన దిశా పటానీ - అదేంటీ అలా అనేసింది