Tollywood Actress Struggling For Food: సినిమా, టీవీ అనే రంగుల ప్రపంచంలో అడుగుపెట్టేందుకు ఎంతో మంది ఎన్నో కష్టాలు దాటి వస్తుంటారు. తమను తాము ఒక్కసారైనా స్క్రీన్‌ మీద చూసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఒక్క ప్రేమ్‌లో తాము ఉన్నా...తామే హీరో, హీరోయిన్లంత ఫీల్‌ అయిపోతుంటారు. ఆ మత్తులోనే ఉంటూ తమ మూలాలు సైతం మర్చిపోయిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఎన్నో సీరియల్స్( TV Serial) నటించి...అడపాదడపా  సినిమాల్లోనూ అవకాశాలు పొందిన ఓ నటి ఇప్పటికీ తమ ఊరిలో టిఫిన్ సెంటర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. షూటింగ్‌లు ఉన్నప్పుడు వెళ్లి నటించి తిరిగి తనపని తాను చేసుకుంటున్నారు.


 

బుల్లితెర నటి కాకా హోటల్

ఎంత ఎత్తుకు ఎదిగిన తమ మూలాలు మర్చిపోకూడదంటారు...అలాగే తమ ఎదుగుదలకు కారణమైన వాటిని వదులుకోకూడదంటారు. ముఖ్యంగా రంగుల ప్రపంచమైన సినిమా అనే మత్తులో దిగిన తర్వాత జీవితానికి సరైన బాటలు వేసుకోకుండా ఇబ్బందులు తప్పవని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మహానటిగా ఎదిగి...ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయలు కళ్లచూసిన సావిత్రి చివరకు ఎన్నో ఇబ్బందులు పడింది.కానీ ఈతరం నటీనటులు  కొంత జాగ్రత్తానే ఉంటున్నారనుకోండి. కానీ ఒకస్థాయికి వెళ్లిన తర్వాత తిరిగి పాత వాసనలు పట్టించుకునేవారు తక్కువే. కానీ తాను అలాంటిదాన్ని కాదని నిరూపించారు బుల్లి తెర నటి తాటి గీత. పదుల సంఖ్యలో సీరియల్లో నటించి, అడపాదడపా సినిమాల్లోనూ ఛాన్స్‌లు దక్కించుకున్న ఆమె...ఇప్పటికీ తమ సొంత ఊరిలో రోడ్డుపక్కన చిన్న బండిపై హోటల్‌ నడుపుతున్నారు. 





 

నల్గొండ(Nalgonda) జిల్లా నకిరేకల్‌(Nakirekal)కు చెందిన తాటిగీత(Thati geetha) బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించింది. గృహప్రవేశం,మనసు మమత, నిన్నే పెళ్లాడుతా, గుప్పెడంత మనసు, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్‌లో నటించింది. మహర్షి (Maharshi), బగవంత్‌ కేసరి(Bhagavanth Kesari), గేమ్ చేంజర్‌ వంటి చిత్రాల్లోనూ తళుక్కుమంది. తమసోమ జ్యోతిర్గమయ, యద్భావం తద్భవతి, బీమదేవరపల్లి బ్రాంచ్‌, ప్రేమ వివాహం, లగ్గం, ట్రెండింగ్‌ లవ్‌స్టోరీ వంటి చిత్రాల్లోనూ నటించింది. హీరోహీరోయిన్లకు తల్లిగానూ ఆమె కనిపించింది.  ఇంకా అనుకున్నన్ని అవకాశాలు రాకపోవడంతో ఏమాత్రం బాధపడకుండా తిరిగి తన స్వగ్రామం వచ్చి తమకు జీవనాధారంగా నిలిచిన రోడ్డుపక్కనే బండిపై హోటల్‌ నిర్వహిస్తోంది. వేషాలు రాకపోయినా హైదరాబాద్‌లోనే ఉంటూ కష్టాలుపడటం కన్నా....తనకు ఎంతో అలవాటైన ఈ పని చేసుకోవడం సుఖంగా ఉందంటోంది. హైదరాబాద్‌( Hyderabad)కు చాలా దగ్గరే కాబట్టి...ఎవరైనా వేషం ఉందని పిలిస్తే వెళ్లి నటించి వచ్చేస్తానంటోంది.


 

సినిమాలపై ఆసక్తి

నకిరేకల్‌లో రామకృష్ణ, వెంకటేశ్వర థియేటర్ల మధ్యలో గీత వాళ్ల ఇల్లు ఉండేదట...చీకటిపడితే చాలు అంతా నిశబ్ధంగా ఉన్న సమయంలో ఆ ధియేటర్ల నుంచి సౌండ్లు, పాటలు తనను ఎంతో ఆకట్టుకునేయని ఆమె తెలిపారు. ఆ పాటలకు అనుగుణంగా ఇంట్లోనే డ్యాన్స్‌లు చేసేదాన్నని తెలిపారు. అలా చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత ఆ డైలాగ్‌లను అనుసరిస్తూ డబ్‌మాష్‌(Dub Mash), టిక్‌టాక్‌(Ticktock) వీడియోలు చేయడంతో చూసిన వాళ్లంతా చాలా బాగున్నాయి సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించారన్నారు. అలా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ హైదరాబాద్‌ చేరిన తనకు సీరియల్స్‌ నటించే అవకాశం దక్కిందన్నారు. తాను ఎక్కడా నటలో శిక్షణ తీసుకోలేదని ఆమె తెలిపారు. ఇప్పటికీ తనకు అవకాశాలు బాగానే వస్తున్నాయని ఆమె తెలిపారు.