HBD M.M. Keeravani: ఎమ్‌ఎమ్ కీరవాణి.. తెలుగు సంగీతాన్ని ఆస్కార్ వేదిక మీదకు తీసుకెళ్లిన గొప్ప సంగీత దర్శకుడు. మూడు దశాబ్దాలుగా తన సంగీతంతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. ఓవైపు కమర్షియల్ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూనే, మరోవైపు ఆధ్యాత్మిక భక్తి రస చిత్రాలకి అద్భుతమైన సంగీతం సమకూర్చడం ఆయనకే చెల్లింది. స్వతహాగా సంగీత దర్శకుడే అయినప్పటికీ.. గాయకుడిగా, రచయితగానూ తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగు సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న స్వరవాణి కీరవాణి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
* ఎంఎం కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో 1961 జూలై 4న జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ గీత రచయిత శివ శక్తి దత్తా. సంగీతం మీదున్న అభిమానంలో కీరవాణి రాగాన్ని ఆయనకు పేరుగా పెట్టారు. కీరవాణి సంగీత ప్రపంచంలో ఎవరికీ అంతనంత ఎత్తుకు ఎదిగి, తన పేరును సార్ధకం చేసుకున్నారు.
* దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి కీరవాణి అన్నయ్య వరుస. రచయితలు విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ కాంచి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంఎం శ్రీలేఖ, కళ్యాణి మాలిక్.. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి చెందివారు. కీరవాణి భార్య ఎంఎం శ్రీవల్లి సినిమాల్లో లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తోంది. పెద్ద కుమారుడు కాల భైరవ తండ్రి బాటలో సంగీత దర్శకుడిగా మారితే.. చిన్న కొడుకు శ్రీ సింహ హీరోగా అరంగేట్రం చేశాడు.
* కీరవాణి కెరీర్ ప్రారంభంలో సి. రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పని చేశారు. రెండేళ్ల పాటు దాదాపు అరవై సినిమాలకు చక్రవర్తి దగ్గరే సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత సాహిత్యంలో మెలుకువలు నేర్చుకోవడం కోసం గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి దగ్గర ఏడాది పాటు శిష్యరికం చేశారు.
* 1990లో 'మనసు మమత' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమయ్యారు కీరవాణి. దీని కంటే ముందు 'కల్కి' అనే చిత్రానికి సంగీతం సమకూర్చారు కానీ, అది విడుదలకు నోచుకోలేదు. 'సీతారామయ్య మనవరాలు'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కీరవాణిని నిలబెట్టింది మాత్రం 1991లో వచ్చిన 'క్షణ క్షణం' చిత్రం. ఇది ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడిగా మొట్ట మొదటి ఫిలిం ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది.
* 1995లో 'క్రిమినల్' హిందీ రీమేక్ కు మ్యూజిక్ అందించడం ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టారు కీరవాణి. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 200లకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు.
* ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన కీరవాణి కెరీర్ లో 'అన్నమయ్య' మరపురాని చిత్రంగా మిగిలిపోయింది. 1997లో వచ్చిన ఈ భక్తిరస చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు.
* కీరవాణి తొలిసారిగా తన సంగీత సారథ్యంలో వచ్చిన 'మాతృదేవోభవ' సినిమా కోసం 'రాలిపోయే పువ్వా' పాట పాడారు. దీనికి సాహిత్యం రాసిన గీత రచయిత వేటూరికి జాతీయ అవార్డు వరించింది. ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజిషన్ లోనూ సాంగ్స్ పాడిన కీరవాణి.. లిరిసిస్ట్ గానూ మంచి పాటలు రాశారు.
* కీరవాణి జాతీయ చలన చిత్ర అవార్డుతో పాటుగా 8 ఫిలింఫేర్ అవార్డులను, 11 నంది పురస్కారాలు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. RRR కోసం కీరవాణి స్వరపరిచిన 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ స్కోర్ క్యాటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ ను సాధించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటుగా హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది.
* హీరో అక్కినేని నాగార్జున, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, రాజమౌళిలతో కీరవాణిది ప్రత్యేకమైన అనుబంధం. హీరోలలో ఆయన ఎక్కువగా నాగార్జున నటించిన చిత్రాలకు సంగీతం సమకూర్చారు. కె. రాఘవేంద్రరావుతో 27కి పైగా చిత్రాలకు పనిచేశారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకూ సంగీతం అందించారు.
* తెలుగులో 'ఎం.ఎం. కీరవాణి'గా, తమిళంలో 'మరకతమణి'గా, హిందీలో 'ఎం.ఎం. క్రీమ్' గా పేరుగాంచారు. భారతీయ సినీ చరిత్రలో వేర్వేరు భాషల్లో, మూడు వేర్వేరు పేర్లతో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఒకే ఒక్క సంగీత దర్శకుడు కీరవాణి అనే చెప్పాలి.
Also Read: విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు గురించి ఈ విషయాలు తెలుసా?