Actor Satyadev Birthday Special: సత్యదేవ్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పరిశ్రమకు ఎప్పుడు వచ్చాడో తెలుసుకునే లోపే సైలెంట్ గా స్టార్‌ డమ్‌ అందుకున్నాడు. వైవిధ్యమైన కథ, పాత్రలతో తరచూ ఆడియన్స్‌ని అలరిస్తుంటాడు. తన సినిమాలో సరికొత్త పాయింట్‌, వైవిధ్యం ఉండేలా తపిస్తూ ఉంటాడు. అందుకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తనదైన నటనతో ప్రత్యేమైన ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండ వచ్చి స్టార్‌ నటుడిగా గుర్తింపు పొందిన సత్యదేవ్‌ బర్త్‌డే నేడు. జూన్‌ 4 సత్యదేవ్‌ బర్త్‌డే సందర్భంగా అతడి వ్యక్తిగత జీవితం, సినీ జర్నీ చూద్దాం!


సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలి...


1989 జూలై 4న వైజాగ్‌లో జన్మించాడు సత్యదేవ్‌. అతడి పూర్తి పేరు సత్యదేవ్‌ కంచరణ. విశాఖపట్నంలోనే ఇంటర్మీడియట్ వరకు చదివిన అతడు విజయనగరంలోని 'ఎమ్.వి.జి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్'లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత 2016లో ఐబీయమ్, వియమ్ వేర్ సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసిన సత్యదేవ్‌ ఆ తర్వాత నటనపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు. మొదట షార్ట్స్‌ ఫిలింలో నటించిన సత్యదేవ్ ప్రభాస్‌‌ 'మిస్టర్ పర్‌ఫెక్ట్‌'లో ఓ చిన్న పాత్ర పోషించాడు. అలా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుంద' సినిమాల్లోనూ చిన్న చిన్న్ రోల్స్‌ చేశాడు. కానీ అవి అతడికి ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. 


జ్యోతిలక్ష్మి'తో తొలి హిట్


కానీ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో చార్మీ ప్రధాన పాత్రలో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' సినిమాతో ఆడియన్స్‌ని మెప్పించాడు. ఈ సినిమాతోనే అతడు నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఈ చిత్రం వరకు సత్యదేవ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే ఇటూ నటుడిగా అవకాశాలు అందుకున్నాడు. జ్యోతిలక్ష్మి మంచి హిట్‌ కావడం, అతడికి గుర్తింపు రావడంతో జాబ్‌ వదిలేసి పూర్తిగా సినిమాలపైనే ఫోకస్‌ పెట్టాడు. అలా 'అంతరిక్షం 9000 కెఎమ్.పిహెచ్' అతికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశాడు సత్యదేవ్. ఆ తర్వాత అతడు లీడ్‌ రోల్లో వచ్చిన 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య', 'గువ్వాగోరింక', 'తిమ్మరుసు' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బాగా అలరించాయి.


దీంతో అతడు టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగాడు. అలా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నటుడిగా.. భారీ బడ్జెట్‌ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ కెరీర్‌లో సక్సెస్‌ ఫుల్‌గా ముందుకు వెళుతున్నాడు. అలా 'సరిలేరు నీకెవ్వరు'లో సోల్జర్‌గా నటించి ఆకట్టుకున్నాడు. కనిపించింది కాసేపే అయినా.. జవాన్‌గా దేశభక్తి చాటాడు. అలాగే ఓ తల్లి కొడుకుగా ఎమోషన్‌ పండించాడు. ఇందులో అతడి పాత్ర ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి'ఆచార్య' కీలక పాత్ర, 'గాడ్‌ ఫాదర్' చిత్రాల్లో నెగిటివ్‌ రోల్లో కనిపించి ఆకట్టున్నాడు. ఆ తర్వాత 'గుర్తుందా శీతాకాలం', 'రామ్ సేతు', 'ఫుల్ బాటిల్' సినిమాల్లో తన నటనతో ఎమోషన్‌ పండించాడు.


హ్యాపీ బర్త్‌డే సత్యదేవ్‌..


ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడకపోయిన సత్యదేవ్‌ నటనకు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. ఇక ఈ ఏడాది 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఎప్పుడో తన కెరీర్‌ మొదట్లో చేసిన ఈ సినిమా కొన్నేళ్ల తర్వాత 2024లో థియేటర్లో విడుదలకు నోచుకుంది. ఈ ఏడాది మే 10న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. చివరికి సత్యదేవ్‌ 'కృష్ణమ్మ'తో మంచి విజయం సాధించాడు. ఇలా వైవిధ్యమైన కథలు, మెసేజ్‌ ఒరియంటెడ్‌ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సత్యదేవ్‌ కెరీర్‌లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో అలరించాలని ఆశిస్తూ అతడికి మరోసారి పుట్టిన రోజు శుభకాంక్షలు.. హ్యాపీ బర్త్‌డే సత్యదేవ్‌.