OG Cinema Update: పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్( Pawan Kalyan) మళ్లీ సినిమాల్లో నటించబోతున్నారా అంటే అవుననే చెప్పాలి...ఇది వాళ్లు, వీళ్లు చెప్పిన రూమర్స్‌ కానేకాదు. స్వయంగా పవన్‌ కల్యాణే నేరుగా పిఠాపురం(Pithapuram) సభలో వెల్లడించారు. డిప్యూటీ సీఎంగా తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ...ఫ్యాన్స్‌ కోసం అడపాదడపా ఒకటి రెండురోజులు వీలు చూసుకుని సినిమాల్లోనూ నటించనున్నట్లు ఆయన వెల్లడించారు..


ఓజీ వచ్చేస్తున్నాడు
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)తన అభిమానులకు ఊగిపోయే వార్త అందించాడు. ఎన్నికల ప్రచారం...విజయం..డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌ నుంచి కొత్త సినిమా(Cinema) వచ్చి దాదాపు రెండేళ్లు దాటిపోయింది. పవన్‌ను వెండితెరపై చూస్తే పూనకాలు వచ్చినట్లు ఊగిపోయే ఆయన ఫ్యాన్స్‌కు  ఖచ్చితంగా ఇది శరాఘాతమే. పవన్‌ను దేవుడిలా పూజించే అభిమానులకు  జనసేన విజయం, పవన్ డిప్యూటీ సీఎం(Deputy Cm)గా ప్రమాణం చేయడం...అసెంబ్లీలోకి అడుగుపెట్టడం వంటివన్నీ మధుర జ్ఞాపకాలే అయినప్పటికీ  వెండితెరపై ఆయన్ను చూసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుంటారు. పవన్‌ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు కాబట్టి ఇక సినిమాల జోలికి రాడనే పుకార్లను పటాపంచలు చేస్తూ....స్వయంగా ఆయన నోటి నుంచి ఓ శుభవార్త వెలువడింది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా అభిమానులను అలరించడానికే తాను అధిక ప్రాధాన్యమిస్తానన్నారు. తప్పకుండా సినిమా(Cinema)ల్లో నటిస్తానని తెలిపిన ఆయన...ముందుగా ఓజీతో పండుగ చేసుకుందాని చెప్పారు. 


నేను ఓజీ అంటే జనం క్యాజీ అంటారు...
పిఠాపురం బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తున్నంత సేపు అభిమానులు ఒకటే హడావుడి చేశారు. మళ్లీ సినిమాలు ఎప్పుడు ప్రారంభిస్తావంటూ గోలగోల చేశారు. రాజకీయ ప్రసంగం ముగింపు తర్వాత చివరిలో అభిమానులకు ఆయన ఓ తియ్యని కబురు చెప్పారు. తప్పకుండా మళ్లీ తాను సినిమాల్లో నటిస్తానని చెప్పారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని చిన్నచిన్న పనులు మిగిలి ఉన్న చిత్రాలను త్వరలోనే పూర్తి చేస్తానన్నారు. త్వరలోనే ఓజీ( O.G)తో కలుసుకుందామంటూ ఆయన హుషారెత్తించారు. అయితే అభిమానులు కూడా తనను అర్థం చేసుకోవాలని...తొలిసారి అధికారంలో ఉన్నానని, ఇప్పుడిప్పుడే రాజకీయం, పాలనపై పట్టు సాధిస్తున్న తరుణంలో తనను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయని వాటిని నెరవేర్చకుంటా నేను ఓజీ అంటూ సినిమాలు చేసుకుంటుంటే జనం క్యాజీ పవన్ అంటారని నవ్వులు పూయించారు. తప్పకుండా సినిమాలు చేస్తానన్న పవన్‌...ఇంతకు ముందు మాదిరిగా కాకుండా వారంలో ఒకటి, రెండు రోజులు వీలు చూసుకుని షూటింగ్‌లకు హాజరవుతానన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి మద్దితిచ్చారని....వారిని నిరాశపరచడానికి వీల్లేదన్నారు. ఇంతకు ముందు కన్నా తాను రెట్టింపు సమయం పనిచేస్తున్నానన్న పవన్‌...గ్రామాల్లో రోడ్లు, తాగునీరు,మురుగునీటి కాల్వలు నిర్మాణనే తమ ప్రథమ కర్తవ్యమన్నారు.


ఫ్యాన్స్‌ జోష్‌
పవన్ మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో అభిమానుల్లో ఒక్కసారిగా హుషారు వచ్చింది. ఓజీ, ఓజీ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. వారిని సముదాయించిన పవన్‌...అభిమానులకు కొన్ని విలువైన సూచనలు చేశారు. ఈమధ్య అందరూ బైక్‌లపై నెంబర్‌ ప్లేట్ల స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాయిస్తున్నారని...ఇది మంచి పద్ధతి కాదని అధికారంలో ఉన్న మనమే నిబంధనలు పాటించకపోతే ఎలా అని ఆయన అన్నారు. ట్రాఫిక్స్‌ రూల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించొద్దన్నారు. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలతో గొడవలు పెట్టుకోవద్దని, సోషల్ మీడియాలో తిట్టుకోవద్దని సూచించారు. అప్పుడు వాళ్లు చేశారని...ఇప్పుడు మనం చేస్తే వారికి, మనకి తేడా లేకుండా పోతుందన్నారు.