Janhvi Kapoor from Devara Sets : మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారతీయ సినిమా 'దేవర'. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి ప్రేక్షకులకు కూడా తెలుసు. భారతీయ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. అయితే... జాన్వీకి తొలి తెలుగు సినిమా ఇది. ఆల్రెడీ ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...


'దేవర'లో తంగంగా...
నయా అతిలోక సుందరి! 
Devara Movie Update : 'దేవర'లో తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. సినిమా సెట్స్ నుంచి మంగళవారం ఆమె కొత్త స్టిల్ విడుదల చేశారు. ఇటీవల వరకు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో 'దేవర' షూటింగ్ చేశారు. ఇప్పుడు గోవాకు యూనిట్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ కొన్ని సీన్లు తీస్తున్నారు. ఆ తర్వాత గోకర్ణ వెళతారు. 


వచ్చే ఏడాది ఏప్రిల్ 5న 'దేవర' ఫస్ట్ పార్ట్ 
'దేవర' సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు కొన్నాళ్ళ క్రితం దర్శకుడు కొరటాల శివ తెలిపారు. అందులో తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read : 'కీడా కోలా' ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది - బ్రహ్మి, తరుణ్ భాస్కర్ సినిమా ఎలా ఉందంటే?






'దేవర' చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతలు. 'విక్రమ్', 'జైలర్', 'జవాన్'... వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 


'దేవర' సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య పాత్రలో సీరియల్ నటి చైత్ర రాయ్, కీలక పాత్రలో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప నటిస్తున్నారు. నటి హిమజ సైతం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చిన, 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్న 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. దాంతో సినిమాపై క్రేజ్ నెలకొంది. 


Also Read వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? మరి, హల్దీ & మెహందీ టైమింగ్స్?



రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్!
అనగనగా ఓ సముద్ర తీరం! అక్కడ ఓ రాయల్ ఫ్యామిలీ ఉంటుంది. నరరూప రాక్షసుల వంటి మృగాల చేతిలో ఆ తీర ప్రాంత ప్రజలు దాడికి గురి అవుతారు. వాళ్ళ సంరక్షణ బాధ్యత తమది అని రాజ కుటుంబం మాట ఇస్తుంది. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న రాయల్ ఫ్యామిలీ వారసుడు ఎన్టీఆర్ అడుగు పెట్టి... రాక్షస సంహారం చేస్తారు. మృగాల మధ్య పెరిగిన మేలిమి ముత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. - ఇదీ కథ అని ఐఎండిబి వెబ్ సైట్ పేర్కొంది. హీరోయిన్ జాన్వీ కపూర్ పాలు అమ్మే యువతి పాత్రలో నటిస్తున్నట్లు కూడా తెలిపింది.


'దేవర' తర్వాత హిందీలో 'వార్ 2' చేయనున్నారు ఎన్టీఆర్. ఆ సినిమాలో హృతిక్ రోషన్, ఆయన కలిసి నటించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసే చిత్రాలు అన్నీ జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నవే.