సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూడో వారంలోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతోన్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ సన్నివేశంలో కాంట్రాక్ట్ కిల్లర్ ఒకరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టీమ్ జెర్సీని ధరించడంపై అభ్యంతరం వ్యక్తం అయింది. అయితే తక్షణమే సినిమాలో RCB జెర్సీని తొలగించాలని ఢిల్లీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.


'జైలర్' సినిమాలో తన కోడలి గురించి అసభ్యకరంగా మాట్లాడిన ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్ల తలలు నరికి చంపేస్తాడు రజినీ కాంత్. అందులో ఒక వ్యక్తి RCB టీమ్ జెర్సీని ధరించడాన్ని గమనించవచ్చు. తమ జెర్సీ ధరించిన వ్యక్తిని మహిళల గురించి అవమానకరమైన రీతిలో మాట్లాడే విధంగా చిత్రీకరించారని పేర్కొంటూ ఆర్సీబీ ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీని థియేటర్లలో ఎవరూ ప్రదర్శించకుండా చూడాలని న్యాయస్థానం చిత్రనిర్మాతలను ఆదేశించింది. టెలివిజన్, శాటిలైట్ లేదా ఏదైనా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సవరించబడిన వెర్షన్ ను ప్రసారం చేయాలని సూచించింది.


“జైలర్ చిత్రంలో RCB టీమ్ జెర్సీని తొలగించాలి లేదా మార్చాలనే ఆదేశాలు 2023 సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. సెప్టెంబర్ 1 తర్వాత, ఏ థియేటర్‌లోనూ RCB జెర్సీని ఏ రూపంలోనూ ప్రదర్శించకూడదని ప్రతివాదులు నిర్ధారించుకోవాలి. టెలివిజన్, శాటిలైట్ లేదా ఏదైనా OTT ప్లాట్‌ఫారమ్‌ లలో సవరించబడిన వెర్షన్ ను మాత్రమే ప్రసారం చేయబడుతుంది” అని హైకోర్టు ఆదేశించింది.


'జైలర్' సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. సన్ టీవీ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓనర్ అనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన నిర్మించిన చిత్రంలో మరో ఐపీఎల్ టీమ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జెర్సీని కించపరిచే విధంగా సన్నివేశాన్ని పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ ప్రతిభా సింగ్ విచారణ చేపట్టారు. 


Also Read: బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ‘జైలర్‌’.. 72 ఏళ్ళ వయసులో రజినీ ర్యాంపేజ్ మామూలుగా లేదుగా!


సినిమాలో RCB జెర్సీ ధరించిన కాంట్రాక్ట్ కిల్లర్ ఒక మహిళ గురించి అవమానకరమైన రీతిలో, స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జెర్సీని అనుమతి లేకుండా నెగెటివ్ గా ఉపయోగించారని, ఇది తమ బ్రాండ్ ఇమేజ్‌ను తక్కువ చేయడమే కాదు, బ్రాండ్ ఈక్విటీని దెబ్బతీసే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించారు. అయితే పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, చిత్రనిర్మాతలు ఐపీఎల్ టీమ్‌ను సంప్రదించి తమ వివాదాలను పరిష్కరించుకున్నారని కోర్టు తెలిపింది. 


సినిమాలో ఆర్సీబీ జెర్సీ కనిపించకుండా సన్నివేశాన్ని మార్చే విధంగా ఫిలిం మేకర్స్ అంగీకరించారని న్యాయస్థానం చెప్పింది. దీని ప్రకారం జెర్సీ ప్రాథమిక రంగులు తొలగించడమే కాదు, స్పాన్సర్ల బ్రాండింగ్ మొదలైనవి కూడా కనిపించకుండా ఎడిటింగ్ చేస్తారని పేర్కొంది. చిత్రనిర్మాతలు, వారి తరపున వ్యవహరించే మిగతా వారందరూ అంగీకరించిన నిబంధనలు షరతులకు కట్టుబడి ఉండాలని జస్టిస్ సింగ్ ఆదేశించారు. ఈ కేసులో న్యాయవాదులు మజుందర్, ప్రియా అద్లాఖా, వర్దన్ ఆనంద్ లు వాది తరపున వాదనలు వినిపించగా.. దీపక్ బిస్వాస్, హర్ష్ బుచ్, సృష్టి గుప్తాలు ప్రతివాదుల తరఫున వాదించారు. 


కాగా, 'జైలర్' సినిమా ఆగస్టు 10న అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించగా, తమన్నా భాటియా స్పెషల్ రోల్ లో మెరిసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్, కన్నడ చక్రవర్తి శివ రాజ్‌ కుమార్, హిందీ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ అతిథి పాత్రల్లో నటించగా.. వసంత్ రవి, మిర్నా మీనన్, వినాయకన్, సునీల్‌, యోగిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఇప్పటి వరకూ 600 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి, తమిళ్ ఇండస్ట్రీ హిట్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 


Also Read: నెల రోజుల గ్యాప్ లో 3 'మెగా' ప్లాపులు.. మెగా ఫ్యామిలీకి అర్జెంటుగా ఒక హిట్టు కావాలెను!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial