టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. UV క్రియేషన్స్ నిర్మాణంలో మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. రిలీజ్ అయిన దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇంటర్వ్యూస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాలకు వెళ్లి చిత్ర బృందం ప్రమోషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రోజు మూవీ యూనిట్ విశాఖలో సందడి చేశారు. విశాఖపట్నంలోని హోటల్ గ్రీన్ పార్క్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. "ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, ప్రోమోస్ కి మంచి రెస్పాన్స్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమాలో నేను స్టాండ్ అప్ కామెడీ పాత్ర చేశాను. నెల్లూరు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో మూవీ ప్రమోషన్ వర్క్ ఇప్పటికే ఫినిష్ చేశాం. విశాఖపట్నంలో ప్రమోషన్ లో భాగంగా CMR షాపింగ్ మాల్ లో ఈవెంట్, ఆర్కే బీచ్ ప్రాంతాల్లో చేసిన ప్రమోషన్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా కాకినాడ, వరంగల్, రాజమండ్రి ప్రాంతాల్లో ప్రమోషన్ వర్క్ ఉంది. మా డైరెక్టర్ మహేష్ కూడా విశాఖపట్నంకి చెందినవాడే. సినిమాలో అనుష్క నుంచి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. కృష్ణాష్టమి పండుగ రోజు విడుదలై అందర్నీ అలరిస్తుంది. నాకు హీరో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో ఉంది. ఇక హీరోయిన్ అనుష్కతో కలిసి సినిమా చేస్తానని చిన్నప్పుడు కల కూడా వచ్చింది. ఇప్పుడు ఆ కల నిజమైంది" అని అన్నారు నవీన్ పోలిశెట్టి.
అనంతరం దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. "వైజాగ్ కి చెందిన వాడిగా ఇక్కడ సినిమా ప్రమోషన్ కోసం రావడం సంతోషంగా ఉంది. హీరో నవీన్ పోలిశెట్టి ఎనర్జీ చూపించే సినిమా ఇది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మన వైజాగ్ లో మంచి ఆదరణ ఉంటుంది. పెళ్లి కాకుండా గర్భిణీ అవ్వాలి అనుకునే అమ్మాయి, ఆమెకు సహకరించిన అబ్బాయి కథే ఈ సినిమా. కథ డిమాండ్ ప్రకారం ఈ సినిమా హైదరాబాద్, లండన్ నగరాల్లో షూటింగ్ చేశాం. అనుష్క మధ్యలో 25 కథలు విన్నా సరే నా కథ విని సినిమా అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉంది. నిర్మాతలు, వంశీ ప్రమోద్ మంచి సినిమా చేశారు" అంటూడైరెక్టర్ మహేష్ చెప్పుకొచ్చాడు.
కాగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుష్క చివరగా 2020లో 'నిశ్శబ్దం' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మళ్లీ మూడేళ్ల విరామం తర్వాత అనుష్క నటిస్తున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఆమెకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Also Read : 'చూడాలని ఉంది' మూవీకి ముందుగా వేరే టైటిల్ అనుకున్నాం, కానీ చిరంజీవి అలా చేశారు: గుణశేఖర్