టాలీవుడ్ లో 'మెగా' హీరోల హవా కాస్త ఎక్కువే ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆ ఫ్యామిలీలో ఎక్కువ మంది హీరోలు ఉన్నారు కాబట్టి, మామూలుగానే ఏడాది పొడవునా వారి సినిమాలే రిలీజ్ అవుతుంటాయి. అవన్నీ కంటెంట్ తో సంబంధం లేకుండా మినిమమ్ ఓపెనింగ్స్ రాబడుతుంటాయి.. సీజన్స్ తో సంబంధం లేకుండా హిట్లు కొడుతుంటాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ మధ్య మెగా కాంపౌండ్ నుంచి నాలుగు వారాల గ్యాప్ లో మూడు సినిమాలు వస్తే, ఒకదాని తర్వాత ఒకటీ అన్నట్లుగా మూడూ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవ్వడం మెగా ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. 


పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఇది 'వినోదయ సిత్తమ్' అనే తమిళ్ మూవీకి రీమేక్. మెగా మేనమామ - మేనల్లుడు తొలిసారిగా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడంతో మెగాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా సాధారణ ప్రేక్షకులనే కాదు, ఫ్యాన్స్ ను సైతం ఆకట్టుకోలేకపోయింది. దీనికి తగ్గట్టుగానే వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలిపోయింది. 


'బ్రో' గాయాన్ని మాన్చడానికి రెండు వారాల తర్వాత ఆగస్టు 11న 'భోళాశంకర్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇది తమిళ్ లో హిట్టైన 'వేదాలమ్' మూవీకి రీమేక్. ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా మెప్పించకపోయినా, డైరెక్టర్ మీద నమ్మకం లేకపోయినా.. 'వాల్తేరు వీరయ్య' జోష్ లో మరో హిట్టు కొడతాడని అభిమానులు ఆశించారు. కానీ ఈ సినిమా తొలి ఆటకే ప్లాప్ టాక్ తెచ్చుకొని, బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. మెగాస్టార్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లిస్టులో చేరిపోయింది. 


Also Read: బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ‘జైలర్‌’.. 72 ఏళ్ళ వయసులో రజినీ ర్యాంపేజ్ మామూలుగా లేదుగా!


రెండు బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ వచ్చాయని బాధ పడుతున్న మెగా ఫ్యాన్స్ పై, లేటెస్టుగా వచ్చిన 'గాండీవధారి అర్జున' సినిమా మరో గట్టి దెబ్బేసింది. మెగా ప్రిన్స్ వరుజ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ గత శుక్రవారం విడుదలైంది. మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందే నిర్మాత టేబుల్ ప్రాఫిట్ తో ఉన్నారని దర్శకుడు చెప్పారు కానీ, ట్రెండ్ చూస్తుంటే బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. 


ఇలా ఒక నెల రోజుల గ్యాప్ లో నలుగురు మెగా హీరోలు కలిసి మూడు పరాజయాలు అందుకున్నారు. 'బ్రో' 'భోళా శంకర్' 'గాండీవధారి అర్జున' సినిమాలతో నిర్మాతలకు దాదాపు 120 కోట్ల నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల్లో నిజమెంతనేది పక్కన పెడితే, బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లతో ఢీలా పడిపోయిన మెగా కాంపౌండ్ తిరిగి పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అర్జెంట్ గా ఒక హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు


ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' అనే చిత్రాన్ని విడుదలకుసిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ సంస్థలు నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది. ముందుగా ఆగస్టు 18న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. మూడు మెగా మూవీస్ మధ్య ఎందుకని భావించారో ఏమో తెలియదు కానీ, నవంబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. మరి ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.


Also Read: గుదిబండల్లా గూఢచారులు.. స్పై జోనర్ లో హిట్టు కొట్టలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial