చిరంజీవి అంటే మాస్! చిరంజీవి అంటే డ్యాన్స్! చిరంజీవి అంటే ఆ డ్యాన్సుల్లో గ్రేస్! ఎటువంటి నేపథ్యం లేకుండా సినిమాల్లో అడుగుపెట్టిన సామాన్య కుర్రాడు, మొగల్తూరు నుంచి మద్రాస్ వచ్చిన యువకుడు ఈ రోజు మెగాస్టార్ అయ్యాడంటే, ఎంతో మంది సామాన్యులకు స్ఫూర్తి ఇచ్చాడంటే... నటనతో పాటు ఆ బాడీలో డ్యాన్స్, ఆ డ్యాన్సుల్లో గ్రేస్, రిథమ్ కూడా కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇప్పుడు ఆ డ్యాన్సులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా చేశాయి.
చిరు డ్యాన్సులకు గిన్నిస్ రికార్డుల్లో చోటు!
తెలుగులో వందల సంఖ్యలో సినిమాలో చేసిన హీరోలు ఉన్నాయి. భారతీయ సినీ పరిశ్రమలోనూ ఎంతో మంది స్టార్లు ఉన్నారు. ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న హీరోల మధ్యలో చిరంజీవి తన ప్రత్యేకత చాటుకోవడం వెనుక డ్యాన్సులది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ డ్యాన్సుల్లో చిరంజీవిది ప్రత్యేకమైన శైలి.
చిరంజీవి 150కు పైగా సినిమాలు చేశారు. అందులో కొన్ని వందల పాటలకు తన శైలిలో నృత్యాలు చేశారు. చిరంజీవి తరహాలో స్టెప్పులు వేసిన ఇండియన్ హీరో మరొకరు లేదని చెబితే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన నృత్యాలకు గిన్నిస్ బుక్ ఫిదా అయ్యింది.
డ్యాన్సులకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో (Guinness Book Of Records) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్థానం సంపాదించుకున్నారు. ఈ రోజు (అనగా సెప్టెంబర్ 22వ తేదీన) హైదరాబాద్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్ వేదికగా జరిగే కార్యక్రమంలో బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా ఆ ప్రకటన జరగనుంది. ఇది మెగా అభిమానులు, తెలుగు ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పవచ్చు.
Also Read: చిరంజీవికి అక్కినేని అవార్డు... అమితాబ్ చేతుల మీదుగా - ANR100 ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన నాగార్జున
పద్మవిభూషణ్ తర్వాత మరో మేలు మజిలీ
చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది (2024) ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. కొన్ని రోజుల క్రితం ఆయనను దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అమ్మాయి క్లీంకార జన్మించింది. అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా ఆయనకు ఏయన్నార్ అవార్డు ఇస్తున్నట్లు ఈ మధ్య నాగార్జున వెల్లడించారు. అక్టోబర్ 28న ఆయనకు ఆ అవార్డు అందజేయనున్నారు. ఇప్పుడు మరో మేలు మజిలీ (గిన్నిస్ బుక్ రికార్డుల్లో) చిరంజీవి ప్రయాణంలో చోటు చేసుకోనుంది.
Also Read: బాసూ.... మీది మెగా మనసు - చిరు, పవన్ తర్వాత గ్లోబల్ స్టార్ భారీ సాయం, ఎంత విరాళం ఇచ్చారంటే?