Cannes Film Festival 2024: ప్రస్తుతం ఇండియన్ సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తోంది. అందుకే 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ మేకర్స్, యాక్టర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ హైలెట్ అయ్యారు. అందులో ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా కూడా ఒకరు. మే 25న జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గెలిచి ఇండియాకు మొదటి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును తీసుకొచ్చారు పాయల్. తను తెరకెక్కించిన మలయాళం - హిందీ మూవీ అయిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’కు ఈ అవార్డ్ దక్కింది. దీంతో అసలు పాయల్ కపాడియా ఎవరో తెలియనివారు తన గురించి తెలుసుకోవడానికి సెర్చింగ్ మొదలుపెట్టారు.
30 ఏళ్ల తర్వాత..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 30 ఏళ్లుగా ఏ ఇండియన్ లేడీ డైరెక్టర్, ఏ ఇండియన్ సినిమా కూడా గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ కోసం పోటీపడలేదు. 1994లో షాజీ ఎన్ కరుణ్ తెరకెక్కించిన ‘స్వాహం’ సినిమా తర్వాత ఏ ఇతర ఇండియన్ సినిమా కూడా కేన్స్ మెయిన్ పోటీల్లో పోటీపడడానికి సెలక్ట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు ఆ అవకాశం ఒక ఇండియన్ సినిమాకు రావడంతో పాటు అవార్డ్ కూడా దక్కడం విశేషం. కేన్స్ జ్యూరీలోని విమర్శకులు సైతం పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ మూవీకి 8 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. దీంతో పాయల్ కపాడియా పేరు ఇండియన్ సినిమాలో మారుమోగిపోతోంది.
ఇంతకు ముందు కూడా..
పాయల్ కపాడియా డైరెక్టర్‌గా పరిచయమవుతూ తెరకెక్కించిన మొదటి సినిమా ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ అయినా కూడా తనకు ఇంటర్నెషనల్ స్టేజ్‌పై మెరవడం కొత్తేమీ కాదు. 38 ఏళ్ల ఈ ఫిల్మ్ మేకర్.. 2021లో తెరకెక్కించిన ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ అనే మూవీ కూడా అప్పటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫీచర్ అయ్యింది. అంతే కాకుండా గోల్డెన్ ఐ అవార్డ్ కూడా దక్కించుకుంది. అంతే కాకుండా తను తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ కూడా అప్పట్లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒక స్పెషల్ కేటగిరిలో ఫీచర్ అయ్యింది. ఇప్పుడు ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ గురించి మాట్లాడుతూ తన సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ మేకర్స్‌కు చూపించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు పాయల్.
ముగ్గురు మహిళల కథ..
‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’లో ఛాయా కదమ్, దివ్య ప్రభ, కానీ కుస్రుతీ లీడ్ రోల్స్‌లో నటించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అమెరికన్ యాక్టర్ వొయిలా డేవిస్ చేతుల మీదుగా గ్రాండ్ ప్రిక్స్ అవార్డును అందుకున్న పాయల్ కపాడియా.. ఇన్‌స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు. ‘‘ముందుగా మా సినిమాను ఫీచర్ చేసినందుకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు చాలా థ్యాంక్స్. మరో ఇండియన్ సినిమాను ఫీచర్ చేయడానికి 30 ఏళ్లు ఆగకండి ప్లీజ్. నా సినిమా ముగ్గురు మహిళలు, వారి మధ్య ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించింది. మామూలుగా మహిళలు ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుతారు. మన సమాజం అలా తయారయ్యింది. అది చాలా దురదృష్టకర విషయం. కానీ నా వరకు నాకు ఫ్రెండ్‌షిప్ అనేది చాలా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చారు పాయల్ కపాడియా.
Also Read: కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఇండియన్ నటి అనసూయ సేన్‌గుప్తా