Gaddar Naa Vote 200 Teaser Launched By Deva Katta: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఏపీ ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాల కోసం తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో ఎవరెవరు ఎంపీలు విజయం సాధిస్తారోనని ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేపథ్య చిత్రాలు కొన్ని వచ్చాయి. అయితే... ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన 'గద్దర్' సినిమా టీజర్ రాజకీయ ప్రచారంలో వాస్తవిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించిందని చెప్పాలి.


మా ఎమ్మెల్యే నాకు 2 వేలు ఇవ్వలేదు!
బోసు కంచర్ల టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'గద్దర్'. నా ఓటు 2000... అనేది ఉప శీర్షిక. చందు లెడ్జర్ (16ఎంఎం క్రియేషన్స్) దర్శకత్వం వహిస్తున్నారు. మన అమరావతి మీడియా ఎల్ఎల్‌పి, ట్యాగ్ మీ డిజిటల్ (ఓపీసీ) ప్రయివేట్ లిమిటెడ్ పతాకాలపై చల్లా తేజ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు దేవా కట్ట సినిమా టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే...



'గద్దర్, అన్నయ్య మీద కేసు పెట్టాడంట్రా!' అని ఓ కార్యకర్త గట్టిగా అరవడంతో 'గద్దర్' టీజర్ మొదలైంది. అప్పుడు ఓ పల్లెటూరులోకి కారు వెళుతున్న దృశ్యాలు చూపించారు. ఆ తర్వాత కోర్టులో కేసు మొదలైంది. 


''అవును సార్... మా ఎమ్మెల్యే సోమశేఖర్ మా ఊరిలో అందరికీ 2 వేలు ఇచ్చాడు సార్ ఓటుకు! నాకు మాత్రం ఇవ్వలేదు'' అని న్యాయమూర్తితో గద్దర్ చెబుతాడు. ఈ డైలాగ్ విన్న వెంటనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని ఘటనలు గుర్తుకు రాక మానవు. తమకు డబ్బులు ఇవ్వలేదని కొందరు మీడియాకు ఎక్కారు. 'గద్దర్' సినిమాలో ప్రధాన పాత్రధారి కోర్టుకు ఎక్కాడు. ప్రజలు ఓటుకు డబ్బులు ఇచ్చారా? లేదా? అని ఆలోచిస్తున్నారు గానీ కనీస మౌలిక వసతుల గురించి ఆలోచించడం లేదనే విషయాన్ని దర్శకుడు సినిమాలో స్పృశించినట్టు తెలుస్తోంది.


Also Read: ముంబైలో ఓటేసిన టాలీవుడ్ హీరోయిన్స్ - లోక్‌ సభ ఎన్నికల కోసం తారాలోకం






''ఈ పెద్ద పెద్ద విషయాల గురించి జనాలకు ఆలోచించుకునే టైం లేదురా! ఆరోగ్యం బాగు చేస్తానని చెప్పు, పని అవ్వదు. చదువు చెబుతానని చెప్పు, పని అవ్వదు. నీళ్లు ఇస్తానని చెప్పు, పని అవ్వదు. ఏదైనా సింపుల్ ఉండాలిరా. రెండు వేలు ఇస్తానని చెప్పు, సింపుల్. మన కులపోడు అని చెప్పు, సింపుల్. మన ప్రాంతం వోడు అని చెప్పు, సింపుల్. ఇవన్నీ కాదు... ఆ రెండు వేలు కాకుండా ఈ పనులు అన్నీ చేస్తానంటే ఎవడైనా ఓటు వేస్తాడా?'' అని వచ్చే వాయిస్ ఓవర్ సమాజంలో తీరును ఎండగట్టింది.


Also Read: ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కలిసొచ్చారే - ముంబైలో పోలింగ్ స్టేషన్స్ దగ్గర బాలీవుడ్ స్టార్స్ సందడి


Gaddar Telugu Movie Cast And Crew: గద్దర్ పాత్రలో బోసు కంచర్ల నటించిన ఈ సినిమాలో దుర్గా రావు మిరపాల, జెస్సీ, బాలాజీ అయ్యనర్, శ్రీపాద శంకర్ రావు, ఖాసీం, శంకు, రాజు ఇతర ప్రధాన తారాగణం. మన అమరావతి మీడియా ఎల్ఎల్‌పి, ట్యాగ్ మీ డిజిటల్ (ఓపీసీ) ప్రయివేట్ లిమిటెడ్ పతాకాలపై చల్లా తేజ నిర్మించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: సూర్య మర్లోతు, అసిస్టెంట్ డీవోపీ: సాయి కుమార్ అల్లూరి, కో డైరెక్టర్: ఫణి వీరపురాజు, ప్రొడక్షన్ డిజైనర్: తేజస్వి రావు, ఛాయాగ్రహణం: పీఎస్ఆర్ మణి, సంగీతం: ఇసాక్ ఫిలిప్, నిర్మాణం: చల్లా తేజ, రచన - దర్శకత్వం - కూర్పు: చందు (16 ఎంఎం క్రియేషన్స్).