Malayalam Cinema: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం మలయాళ సినిమాల జోరు కనిపిస్తోంది. వరుస విజయాలతో మాలీవుడ్ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. అక్కడి ఫిలిం మేకర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతోనే బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. థియేటర్లలోనే కాదు, ఓటీటీ వేదికలపైనా విశేష ఆదరణ పొందుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ చిత్రాల్లో మహిళా పాత్రల ప్రాధాన్యత తగ్గిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


ఇటీవలి కాలంలో ఘన విజయం సాధించిన మలయాళ సినిమాలను మనం గమనిస్తే, కొన్నిటిలో అసలు పూర్తిగా మహిళల పాత్రలు లేవు. మరికొన్నిట్లో స్త్రీల పాత్రలు ఉన్నా వారికి కథలో పెద్దగా ప్రాధానత్య ఉండదు. 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' మూవీనే తీసుకుంటే.. ఈ అడ్వెంచర్‌ సర్వైవల్ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. కేవలం రూ. 20 కోట్లతో తీస్తే దాదాపు రూ. 240 కోట్లకుపైగా కలెక్ట్ చేసి, మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలు కనిపించవు.


అలానే రీసెంట్ గా హిట్టయిన 'ఆవేశం' విషయానికొస్తే.. ఫహద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ₹150 కోట్లకు పైగా వసూలు చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అయితే ఈ మూవీలో హీరో సరసన హీరోయిన్ లేదు. ఇతర కీలక పాత్రలు పోషించిన ముగ్గురు కుర్రాళ్ళకి జోడీ లేదు. సినిమా అంతా చూసిన ఎక్కడా లేడీస్ ఉండరు. కొన్ని సీన్స్ కాలేజీ క్యాంపస్‌లో సెట్ చేసినప్పటికీ ఒక్క అమ్మాయి కూడా మెయిన్ గా కనిపించదు.


మలయాళం నుంచి వచ్చిన మరో వైవిధ్యమైన చిత్రం 'భ్రమయుగం'. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫుల్ రన్‌లో రూ.80 కోట్ల వరకూ రాబట్టింది. ఇది కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడిన హారర్ థ్రిల్లర్. కథంతా మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మమ్ముట్టితో పాటుగా అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. దీంట్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ఎవరూ ఉండరు. పేరుకి అమల్డా లిజ్ ఉంది కానీ, ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు.


టొవినో థామస్‌ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్ 'అన్వేషిప్పిమ్‌ కండెతుమ్‌'. రూ.8 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కూడా రూ.40 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ లేదు. పోలీసాఫీసర్ అయిన హీరో అక్కడ చనిపోయిన యువతల కేసును ఎలా విచారించాడనేది ఉత్కంఠగా చూపించారు కానీ, అతని ప్రేయసి లేదా భార్య పాత్రలను కథలో ప్రస్తావించలేదు. రీసెంట్‌గా టోవినో థామస్‌ నటించిన 'నడికార్‌' మూవీలో భావన పాత్ర గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు.


ఇక జయరామ్‌, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో 'అబ్రహం ఓజ్లర్‌' అనే క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ తెరకెక్కింది. ఆసుపత్రిలో జరిగే వరుస హత్యలను పోలీస్‌ ఆఫీసర్‌ అయిన అబ్రహాం ఎలా ఛేదించాడన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందించబడింది. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 45 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో మహిళా ప్రధాన పాత్రలు ఉన్నప్పటికీ, వారికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించలేదు.


నివిన్ పౌలీ నటించిన 'మలయాళీ ఫ్రమ్ ఇండియా' సినిమాలో కూడా మహిళల పాత్రలకు పెద్దగా ప్రాధానత్య లేదు. అనశ్వర రాజన్ లాంటి ప్రముఖ నటి ఉన్నప్పటికీ, ఆమెది సినిమాలో కేవలం 10 నిమిషాలపాటు సాగే అతిధి పాత్ర మాత్రమే. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం - ది గోట్ లైఫ్' చిత్రంలోనూ మహిళలకు ఎటువంటి స్కోప్ లేదు. అమలా పాల్ ఉన్నప్పటికీ, ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.


ఇలా ఇటీవల కాలంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మలయాళ సినిమాల్లో హీరోయిన్లు లేకపోవడం, చాలా వరకు బలమైన స్త్రీ ప్రధాన పాత్రలు లేకపోవడం, ఉన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలను అందించడానికి, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడానికి ఎప్పుడూ ముందుండే మలయాళ చిత్ర పరిశ్రమలో ఇలాంటి ధోరణి కనిపిస్తుండటంపై ఓ వర్గం అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి.


Also Read: 5 రోజుల్లో 50 కోట్లు - అంతలోనే పైరసీ!