Prithviraj Sukumaran's filed complaint on Guruvayoor Ambalanadayil Piracy: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'గురువాయూర్ అంబలనాదయిల్'. ఇటీవలే రిలీజైన ఈ కామెడీ ఎంటర్టైనర్, బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, 100 కోట్ల మార్క్ దిశగా పయనిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు పైరసీ ముప్పు వాటిల్లింది. దీనిపై చిత్ర నిర్మాత, హీరో పృథ్వీరాజ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 


'గురువాయూర్ అంబలనాడైల్' సినిమా మే 16న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. అయితే రిలీజైన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. పలు పైరసీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ మూవీ థియేటర్ ప్రింట్ ను అప్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో పైరసీకి వ్యతిరేకంగా పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్ట్ పెడుతూ... సినిమా తీయడానికి పడిన కష్టాన్ని, సృజనాత్మకతను కాపాడుకోవడానికి అందరం కలిసి నిలబడడాలని పిలుపునిచ్చారు.


“థియేటర్‌లలో విజయవంతంగా రన్ అవుతున్న 'గురువాయూర్ అంబలనాడైల్' సినిమాను సోషల్ మీడియాలో షేర్ చేయడం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై కేరళ పోలీస్ సైబర్ విభాగంలో కేసు నమోదు చేయబడింది. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించారు. సినిమాలోని పైరసీ కాపీలు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సినిమా తీయడానికి పడిన శ్రమను, సృజనాత్మకతను కాపాడుకోవడానికి సహకరించండి. పైరసీకి నో చెప్పండి!’’ అని పృథ్వీరాజ్ తన నోట్‌లో పేర్కొన్నారు. 






కాగా, 'గురువాయూర్ అంబలనాదయిల్' చిత్రాన్ని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సుప్రియా మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సివి సారథి నిర్మించారు. 'జయ జయ జయ జయహే' ఫేమ్ విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. దీనికి దీపు ప్రదీప్ కథ అందించగా.. అంకిత్ మీనన్ సంగీతం సమకూర్చారు. పెళ్లికి సంబంధించిన సంఘటనలే ప్రధాన ఇతివృత్తంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ కు జోడీగా నిఖిలా విమల్ నటించగా.. బాసిల్ జోసెఫ్ సరసన అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. సిజు సన్నీ, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.



'గురువాయూర్ అంబలనాదయిల్' సినిమా కేరళ రాష్ట్రంలోనే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ చాలా అద్భుతమైన రన్ సాధిస్తోంది. ఓవర్ సీస్ లో ఫస్ట్ వీకెండ్ లోనే 2.62 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. ట్రెండ్ చూస్తుంటే రాబోయే వారంతం వరకూ బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా సందడి కొనసాగేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే పృథ్వీరాజ్ కెరీర్ లోనే కాదు, మలయాళ చిత్ర పరిశ్రమ ఖాతాలోకి కూడా ఈ ఏడాది మరో 100 కోట్ల గ్రాసర్‌ వచ్చి చేరినట్లుఅవుతుంది.






ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ విషయానికొస్తే, గతేడాది 'సలార్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ యాక్టర్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'గురువాయూర్ అంబలనాదయిల్' చిత్రంతో మరో సూపర్ హిట్ సాధించడం విశేషం.


Also Read: కాజల్‌కు 'అందరికీ నమస్కారం' తప్ప ఇంకేం రాదా?