పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అవుతోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
'బ్రో' ట్రైలర్ ఎలా ఉందో చూడండి!
'భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా? మీ మనుషులు అందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వరు' అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ ను పరిచయం చేశారు. అతని ప్రేయసిగా కేతికా శర్మ కూడా కనిపించారు. ప్రతిదానికీ తనకు టైమ్ లేదని చెప్పే హీరోకి టైమ్ ఎదురైతే ఏమైందనేది కథ. ఓ రోడ్డు ప్రమాదం హీరో జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? అనేది థియేటర్లలో చూడాలి. ట్రైలర్ చివరిలో పవన్ డైలాగులు, ఆ హుషారు హైలైట్ అసలు. 'జల్సా'లో పవర్ స్టార్ ఐకానిక్ స్టెప్ ను గుర్తు చేశారు.
రీమేక్ కాదిది... చాలా మార్పులు చేశాం - సముద్రఖని
తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'వినోదయ సీతం' ఆధారంగా 'బ్రో' తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా రీమేక్ కాదని ఆయన చెబుతున్నారు. తమిళ మాతృక ఆధారంగా కొత్తగా సినిమా చేశామన్నారు. పది నిమిషాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథంతా మార్చారని... పవన్, తేజ్ హీరోలుగా సినిమా చేయాలనే ఐడియా ఆయనదేనని సముద్రఖని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రూపొందించామన్నారు. పవన్ పది పదిహేనేళ్ళు వెనక్కి వెళ్లి హుషారుగా నటించారని చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ మొదటి పది నిమిషాలే ఉండరు - టీజీ విశ్వప్రసాద్
మొదటి ఐదు, పది నిముషాలు మినహాయిస్తే మిగతా సినిమా అంతా పవన్ కళ్యాణ్ ఉంటారని చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''బలమైన కుటుంబ భావోద్వేగాలు, వాణిజ్య హంగులతో కూడిన సినిమా 'బ్రో'. ఇది పూర్తిగా సందేశాత్మక సినిమా కాదు. తమిళంతో పోలిస్తే సినిమా కొత్తగా ఉంటుంది'' అని చెప్పారు. ఈ నెల 25న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తామని తెలిపారు.
Also Read : 'ఓపెన్ హైమర్' రివ్యూ : ఇది నోలన్ సినిమా, అణుబాంబు సృష్టికర్త బయోపిక్!
'బ్రో'లో సాయి ధరమ్ తేజ్ జోడీగా 'రొమాంటిక్' భామ కేతికా శర్మ కూడా నటించారు. హీరో ప్రేయసి పాత్రలో ఆమె నటించారు. 'రంగ రంగ వైభవంగా'లో సాయి తమ్ముడు వైష్ణవ్ తేజ్ జోడీగా ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అన్నయ్యతో నటించే ఛాన్స్ కొట్టేశారు. 'బ్రో'లో వింక్ గాళ్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉన్నారు. ఆమె పాత్ర ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పవన్, తేజ్... ఇద్దరితో తనకు సన్నివేశాలు ఉన్నాయని ప్రియా వారియర్ చెప్పారు. ఇక... 'మై డియర్ మార్కండేయ' పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేశారు.
Also Read : నవదీప్ సమర్పణలో 'సగిలేటి కథ' - వెండితెరకు హీరోగా యూట్యూబర్ రవితేజ
సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం : ఎస్. థమన్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial