హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan)కు ఇండియాలోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన తీసిన 'బ్యాట్ మ్యాన్ బిగిన్స్', 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్', 'డంకర్క్' చిత్రాలు మెచ్చిన జనాలున్నారు. 'ఇంటర్ స్టెల్లార్', 'టెనెట్' అర్థం కాలేదని విమర్శించిన ప్రేక్షకులూ ఉన్నారు. హాలీవుడ్ ఈతరం దర్శకుల్లో ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం చూపిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. ఆయన తీసిన తాజా సినిమా 'ఓపెన్ హైమర్'. అమెరికన్ శాస్త్రవేత్త, అణు బాంబు సృష్టికర్త జీవితం ఆధారంగా, ఆయన పేరుతో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉందంటే?


కథ (Oppenheimer Movie Story) : రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో అణు బాంబు తయారు చేయమని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ (సిలియన్ మర్ఫీ)ని అమెరికన్ అటామిక్ ఎనర్జీ అధ్యక్షుడు లూయిస్ స్ట్రాస్ (రాబర్ట్ డౌనీ జూనియర్) సంప్రదిస్తారు. లాస్ అల్మాస్ పేరుతో ఓ నగరాన్ని నిర్మించి, కొంత మంది శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగాలు చేస్తారు. విజయవంతంగా అణుబాంబు తయారు చేస్తారు. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ప్రభుత్వం ఆ బాంబులు వేస్తుంది. అణుబాంబు తయారీకి ముందు ఓపెన్ హైమర్ జీవితంలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైంది? అణుబాంబు ప్రయోగించిన కొన్నేళ్ళ తర్వాత ఓపెన్ హైమర్ మీద అమెరికా ప్రభుత్వం ఎందుకు ట్రయిల్ చేపట్టింది? అనేది సినిమా. 


విశ్లేషణ (Oppenheimer Movie Analysis) : సినిమాలో ఏముందో చెప్పే ముందు... ఓ సీన్ గురించి చెప్పాలి. హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు ప్రయోగించిన తర్వాత ఓపెన్ హైమర్ (Oppenheimer)ను అమెరికా అధ్యక్షుడు పిలుస్తారు. అప్పుడు 'నా చేతికి రక్తం అంటింది' అని ఓపెన్ హైమర్ చెబుతారు. 'జపాన్ ప్రజలు బాంబు తయారు చేసింది ఎవరు? అని ఆలోచించరు. వేసింది ఎవరు? అని చూస్తారు' అని అధ్యక్షుడు చెబుతారు. 


హిరోషిమా, నాగసాకిలో జరిగిన విధ్వంసానికి ఎవరిని నిందించాలి? అణుబాంబు తయారు చేసిన ఓపెన్ హైమర్నా? అమెరికా అధ్యక్షుడినా? ప్రేక్షకుల్ని క్రిస్టోఫర్ ఆలోచనలో పడేశారు. ఆ సన్నివేశంలో, అంతకు ముందు ఓపెన్ హైమర్ మానసిక సంఘర్షణను క్యాప్చర్ చేసిన తీరు అమోఘం. మరో సన్నివేశంలో 'Now i am become death, the destroyer of worlds' అని ఓపెన్ హైమర్ చెబుతారు. 'ఇప్పుడు నేను యముడిని, ప్రపంచ వినాశకారి' అంటుంటే... అణుబాంబు ప్రయోగం విజయవంతమైన సంతోషం కంటే, బాధ కనబడుతుంది. 

దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్ అత్యుత్తమ ప్రతిభ చూపించిన సన్నివేశాలు కోకొల్లలు. కేవలం అణుబాంబు మాత్రమే ఆయన సినిమాను పరిమితం చేయలేదు. వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన పర్వాలను, పేరు కోసం పాకులాటలు, రాజకీయాలు... చాలా చూపించారు. అయితే... కథను చాలా అంటే చాలా నిదానంగా డిటైల్డ్ గా చెప్పారు. అందువల్ల, సాగదీసి సాగదీసి చెప్పినట్లు ఉంటుంది. 


దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఊహను సినిమాటోగ్రాఫర్ Hoyte van Hoytema చక్కగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. Ludwig Göransson నేపథ్య సంగీతం కథతో పాటు ప్రయాణించేలా చేసింది. అణుబాంబు ప్రయోగం తర్వాత నిశ్శబ్దం మాత్రమే కొన్ని క్షణాలు వినబడుతుంది. ఆ విధ్వంసాన్ని ప్రేక్షకుడు ఫీలయ్యే గ్యాప్ ఇచ్చారు. కొన్ని విషయాలు చెప్పడానికి మౌనాన్ని మించిన భాష ఏముంటుంది? సినిమాలో క్లోజప్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ అద్భుతంగా క్యాప్చర్ చేశారు. 


ఓపెన్ హైమర్ ఎలా ఉంటారో ఈతరం ప్రజలకు తెలియదు. సినిమా చూశాక... సిలియన్ మర్ఫీ తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఆయన నటించలేదు... పాత్రకు ప్రాణం పోశారు. ఓపెన్ హైమర్ జీవితంలో వివిధ దశలను చక్కగా చూపించారు. ఆయన భార్యగా కిట్టి పాత్రలో ఎమిలీ బ్లంట్ పర్ఫెక్ట్ యాప్ట్. ఇక, లూయిస్ పాత్రలో 'ఐరన్ మ్యాన్' ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ నటన, గెటప్ పరంగా ఆయన చూపిన వేరియేషన్ మరిచిపోవడం కష్టం. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


Also Read : 'బవాల్' సినిమా రివ్యూ : లక్నోలో కొత్త పెళ్లి జంట జీవితానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధం ఏమిటి?


క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్లో టిపికల్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆయనకంటూ ఓ స్టైల్ ఉంది. ఈ సినిమాలోనూ అది కంటిన్యూ అయ్యింది. కాకపోతే, అర్థం కానంత ఏమీ లేదు. 'ఓపెన్ హైమర్'లో ప్రధాన సమస్య ఏమిటంటే... సంభాషణలు, నిడివి! దాంతో కొందరికి డాక్యుమెంటరీలా అనిపించవచ్చు. ప్రారంభం నుంచి ముగింపు వరకు సినిమా అంతా ఎక్కువగా సంభాషణల మీద నడుస్తుంది. నోలన్ సెటిల్డ్ డ్రామా భారతీయ ప్రేక్షకుల్లో ఎంత మందికి నచ్చుతుంది? అనేది సందేహమే. 


అణుబాంబు ప్రయోగం వెనుక కథను మాత్రమే చెబితే... క్రిస్టోఫర్ నోలన్ స్పెషాలిటీ ఏం ఉంటుంది? నైతిక విలువల గురించి ఆయన డిస్కస్ చేశారు. చివర్లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఓపెన్ హైమర్ మధ్య చూపించిన సీన్ హైలైట్. బయోగ్రాఫికల్ కథలపై ఆసక్తి చూపించే ప్రేక్షకులకు, నోలన్ అభిమానులకు 'ఓపెన్ హైమర్' మాంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా నుంచి రేసీ స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్లు వంటివి ఆశించవద్దు. సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్ తదితరుల అద్భుతమైన నటన కోసం, ఓ విధ్వంసానికి కారణమైన మనిషిలో మానసిక సంఘర్షణ కోసమైనా సినిమా చూడాలి. 


Also Read 'హత్య' రివ్యూ : 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎలా ఉందంటే?












ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial