యూట్యూబ్ ఫిలిమ్స్ చూసే తెలుగు ప్రేక్షకులకు రవితేజ మహాదాస్యం (Ravi Teja Mahadasyam) పరిచయమే. ఆయన కొన్నిటిలో హీరోగా నటించారు. కొన్ని లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. వెండితెరపై కొన్ని సినిమాల్లో మెరిశారు కూడా! ఇప్పుడు ఆయన హీరోగా పరిచయం అవుతున్నారు. 


నవదీప్ సి స్పేస్ సమర్పణలో...
రవితేజ హీరోగా 'సగిలేటి కథ'!రవితేజ మహాదాస్యం కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'సగిలేటి కథ' (Sagileti Katha). ఇందులో విషిక కోట కథానాయిక. రాజశేఖర్ సుద్ మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి స్పేస్ సమర్పణలో అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయి. త్వరలో సినిమా విడుదల కానుంది. అంత కంటే ముందు ట్రైలర్ రానుంది. 


జూలై 31న 'సగిలేటి కథ' ట్రైలర్
ఈ నెలాఖరున... 31వ తేదీన 'సగిలేటి కథ' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 'రెడీగా ఉందండోయ్' అంటూ హీరో రవితేజ మహాదాస్యం సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సినిమా చూసిన నవదీప్ తన సమర్పణలో విడుదల చేస్తానని చెప్పడంతో తమకు కొండంత అండ దొరికినట్టు అయ్యిందని చిత్ర బృందం తెలిపింది.






రాయల సీమలో 'సగిలేటి కథ'
రాయలసీమలోని ఓ గ్రామం నేపథ్యంలో 'సగిలేటి కథ' చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు రాజశేఖర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''సీమలోని ఓ ఊరిలో పాత్రల మధ్య జరిగిన నాటకీయ ఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. ఆయా పాత్రల మనస్తత్వాలకు అద్దం పట్టే సన్నివేశాలు ఉంటాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులకు ఆ క్యారెక్టర్లు గుర్తు ఉంటాయి. సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలను నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. ప్రతి పాత్ర చాలా సహజంగా ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఇందులో చికెన్ కూడా ఒక క్యారెక్టర్. 'చికెన్ అంటే కూరో, వేపుడో కాదు... చికెన్ అంటే ఒక ఎమోషన్'. రాయల సీమ నేటివిటీ, కల్చర్, ట్రెడిషన్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయి'' అని చెప్పారు.


Also Read : 'ఓపెన్ హైమర్' రివ్యూ : ఇది నోలన్ సినిమా, అణుబాంబు సృష్టికర్త బయోపిక్!


'కనబడుటలేదు' తర్వాత షేడ్ స్టూడియోస్ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఎలా అయితే కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చారో... ఈ సినిమాలోనూ అదే విధంగా కొత్త తారలకు అవకాశం ఇచ్చారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని షేడ్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. 


రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటించిన ఈ చిత్రానికి రచన, కూర్పు, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలు రాజశేఖర్ సుద్ మూన్ చూసుకున్నారు. అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : నరేష్ బాబు మాదినేని, స్వరాలు : జశ్వంత్ పసుపులేటి, నేపథ్య సంగీతం సనల్ వాసుదేవ్, సాహిత్యం : వరికుప్పల యాదగిరి, రాజశేఖర్ సుద్మూన్, శశికాంత్ బిల్లపాటి, పవన్ కుందని. 


Also Read : దసరాకు 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ ఆయుధపూజ - రిలీజ్ డేట్ చెప్పేశారోచ్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial