పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు జరిగాయి. అయితే... ఓ చిన్న ట్విస్ట్ ఉంది.

  


ఆలస్యంగా 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుక!
హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటున్న ఏరియాల్లో హైటెక్ సిటీ, మాదాపూర్ కూడా ఉన్నాయి. శిల్పకళా వేదిక జంక్షన్ దగ్గర అయితే సాయంత్రం ట్రాఫిక్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సాయంత్రం వేళలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటికి వెళ్లే వేళల్లో మరింత ట్రాఫిక్ ఉంటుంది. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుక సమయాన్ని కాస్త వెనక్కి జరిపారు.


సాధారణంగా ప్రీ రిలీజ్ వేడుకలు అంటే ఆరు నుంచి ఏడు గంటల లోపు మొదలు పెట్టడం ఆనవాయితీ. పెద్ద సినిమాలు ఇంకాస్త ఆలస్యం అవుతాయి. అయితే... 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకను ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. 


పోలీసుల సూచనతో వెనక్కి!
'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకను ఆలస్యంగా మొదలు పెట్టమని చిత్ర బృందానికి సిటీ పోలీసులు కూడా సూచించినట్లు తెలిసింది. ''ప్రజల సౌకర్యం, ట్రాన్స్‌పోర్ట్, భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని పవర్ ప్యాక్డ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్ రాత్రి 8.30 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం. దీనిని దృష్టిలో పెట్టుకుని వేదిక దగ్గరకు ఆ సమయానికి రండి'' అని 'బ్రో' నిర్మాణ సంస్థ మీడియాకు విడుదల చేసిన నోట్ లో పేర్కొంది.


Also Read వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ  
 





ట్రైలర్, థీమ్ సాంగ్ అదిరాయి!
'బ్రో'లో రెండు పాటలు 'మై డియర్ మార్కండేయ', 'జాణవులే'కు అభిమానుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. అయితే... ఇటీవల విడుదల చేసిన థీమ్ సాంగ్ అందరికీ నచ్చింది. అలాగే, ట్రైలర్ కూడా! ముఖ్యంగా ట్రైలర్ చివర్లో 'జల్సా'ను గుర్తు చేస్తూ వచ్చిన షాట్స్ అయితే అభిమానులకు కిక్ ఇచ్చాయి. 


Also Read డీఎస్పీ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!



'బ్రో'లో సాయి ధరమ్ తేజ్ జోడీగా కేతికా శర్మ నటించారు. హీరో ప్రేయసిగా ఆమె కనిపిస్తారు. ఈ సినిమాలో వింక్ గాళ్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉన్నారు. ఆమె పాత్ర ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పవన్, తేజ్... ఇద్దరితో తనకు సన్నివేశాలు ఉన్నాయని ప్రియా వారియర్ చెప్పారు. ఇక... 'మై డియర్ మార్కండేయ' పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేశారు. సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం : ఎస్. థమన్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల.




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial