Dil Raju New Movie with Yash Master : 'ప్రతి రోజు పండగే', 'సోలో బ్రతుకే సో బెటర్', 'చిత్రలహరి', 'శ్యామ్ సింగరాయ్' వంటి చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన యశ్వంత్ మాస్టర్ ప్రతిష్టాత్మక బ్యానర్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. 'బలగం' సినిమాతో సెన్సేషన్ హిట్ అందుకున్న నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఇటీవలే ప్రొడక్షన్ నెం.2ను ప్రకటించారు.
ఈ సినిమాకు సంబంధించి జరిగిన లాంచ్ ప్రెస్ మీట్‌లో మూవీలోని తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ ప్రకటించారు. 'ఆకాశం దాటి వస్తావా' అనే పేరుతో ఈ సినిమా రూపొందుతోందని చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ సినిమాలో యష్ మాస్టర్ హీరోగా నటిస్తుండగా, మలయాళ నటి కార్తీక మురళీదరన్ హీరోయిన్ గా అలరించనుంది. ఈమె బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మురళీధరన్ కుమార్తె.
కార్తీక మురళీధరన్ కూడా ఈ చిత్రం ద్వారానే హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు చేశారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు శశి కుమార్ ముత్తులూరి దర్శకత్వం వహించనున్నారు. పూర్తి వినోదంతో కూడిన మ్యూజికల్, డ్యాన్స్ బేస్డ్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ప్రముఖ నేపథ్య గాయకుడు కార్తీక్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ని శిరీష్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం టాప్ క్లాస్ టెక్నీషియన్స్ పని చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు యువ, ప్రతిభ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనున్నారు.
ఈ సినిమా గురించి మాట్లాడిన దిల్ రాజు.. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ అని చెప్పారు. దర్శకుడు శశి తన లైఫ్‌లో జరిగిన విషయాలనే కథగా రాసుకున్నారని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం బలమని.. కార్తీక్ అన్ని పాటలూ అద్భుతంగా చేశారని అన్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ‘బలగం’ తరవాత కొత్త టాలెంట్‌ను పరిచయం చేయాలనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాను అందిస్తున్నామని వెల్లడించారు.
కాగా, టాలీవుడ్ నుంచి ఇప్పటికే డాన్స్ మాస్టర్ జానీ హీరోగా పరిచయం అవుతున్నారు. ‘యథా రాజా తథా ప్రజా’ అనే సినిమాలో జానీ మాస్టర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్నారు. ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్, శ్రేష్ఠ వర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, జానీ మాస్టర్ మాస్ స్క్రిప్ట్ ఎంపిక చేసుకోగా.. యశ్ మాస్టర్ మాత్రం క్లాస్ లవ్‌స్టోరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కొరియోగ్రాఫర్లు హీరోలుగా ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.
Read Also : Sakshi Dhoni: నేను అల్లు అర్జున్‌కు వీరాభిమానిని: 'ఎల్జీఎం' ఈవెంట్‌లో ధోని భార్య సాక్షి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial