Boney Kapoor Comments on RRR and Pathaan Movie Over Maidaan Disaster: ఈ మధ్య పాన్‌ ఇండియాతో పాటు బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. అలనాటి నటి సావిత్రి బయోపిక్‌ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్లో 'మహానటి' పేరుతో వచ్చిన ఈ బయోపిక్‌ ఏకంగా రెండు నేషనల్‌ అవార్డ్స్‌నే గెలుచుకుంది. దాంతో డైరెక్టర్స్‌ అంతా బయోపిక్‌లపై ఫోకస్‌ పెడుతున్నారు. ప్రముఖుల జీవితల కథలను తీస్తూ వెండితెరపై ఆవిష్కరించి హిట్స్‌ కొడుతున్నారు.


కానీ, 'మహానటి' స్థాయిలో ఏ బయోపిక్‌ కూడా ఆకట్టుకోలేకపోయింది. అందులో ఇటీవల రిలీజ్‌ అయిన 'మైదాన్'‌ కూడా ఒకటి. బాలీవుడ్‌ అగ్ర‌ హీరో అజయ్‌ దేవగన్‌ నటించిన ఈ మూవీ ఏప్రిల్‌ 10న థియేటర్లో రిలీజ్‌ అయ్యి భారీ డిజాస్టర్‌ అందుకుంది. హైదరాబాద్‌కు చెందిన భారత ఫుట్‌ బాల్‌ టీం కోచ్‌ రహీమ్‌ సాబ్‌ జీవిత కథ ఆధారంగా మైదాన్‌ రూపొందింది. ఏషియన్ గేమ్స్‌లో దేశానికి గోల్డ్ మెడల్స్ తెచ్చిన ఘనత ఆయన సొంతం. ఆయన మరణం తర్వాత మేజర్ టోర్నమెంట్లలో మన ఇండియన్ టీం ఒక్క ఫుట్‌ బాల్ మెడల్ కూడా సాధించలేదు. అంతటి ఘన కీర్తి కలిగిన రహీమ్‌ సాబ్‌ జీవితంపై తీసిన 'మైదాన్‌' హిందీ ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. చెప్పాలంటే అజయ్‌ దేవగన్‌ కెరీర్‌లోనే మైదాన్‌ భారీ డిజాస్టర్ అయ్యి మేకర్స్‌కి నష్టాలు చూపించింది.బాలీవుడ్‌లో లీడ్‌ ప్రొడ్యూసర్‌, నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఈ మూవీని నిర్మించారు. మొత్తం థియేట్రికల్‌ రన్‌లో ఈ సినిమా కనీసం  రూ. 50కోట్లు కూడా చేరుకోలేదని సినీ విశ్లేషకుల నుంచి సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ డిజాస్టర్‌పై నిర్మాత బోనీ కపూర్‌ స్పందించారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనకు మైదాన్‌ పరాజయంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "మేము ఎంచుకున్న సబ్జెక్ట్‌ అద్భుతమైంది. అజయ్‌ దేవగన్‌ కూడా అద్బుతమైన నటుడు.


Also Read: 'అరుంధతి'లోని ఈ చిన్నారి జేజమ్మ ఇప్పుడెలా ఉందో చూశారా? - ప్రస్తుతం ఏం చేస్తుందంటే!


కానీ ఈ సినిమా వర్క్‌ అవుట్‌ కాలేదు. ఎందుకంటే మేము ఆడియన్స్‌ డిమాండ్స్‌ని గుర్తించలేకపోయాం. సినిమా విషయంలో ప్రస్తుతం ప్రేక్షకుల కోణం మారింది. అంతా యాక్షన్, అడ్వేంచర్‌ సినిమాలే కోరుకుంటున్నారు. ఎలా అంటే ఆర్‌ఆర్‌ఆర్‌, జవాన్‌, పఠాన్‌ వంటి ఫ్రంట్‌-ఫూట్‌ యాక్షన్‌ చిత్రాలనే ఆశిస్తున్నారు" అంటూ బోనీ కపూర్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సరైన హిట్స్‌ లేక బాలీవుడ్‌ బాక్సాఫీసు డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. పఠాన్‌, జవాన్‌, యానమిల్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత ఆ రేంజ్‌లో హిట్‌ పడి చాలా కాలం అవుతుంది. మైదాన్‌ మూవీ అయినా బి-టౌన్‌ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేస్తుందని అంతా ఆశపడ్డారు. కానీ ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో చెప్పుకొదగ్గ హిట్‌ కానీ, సినిమా కానీ లేదు. ఇక ఈ ఏడాది బి-టౌన్‌ బాక్సాఫీసు రక్షించేంది మన తెలుగు సినిమాలే. వరసగా నష్టాలు చూస్తున్న బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ అంతా ఇప్పుడు 'పుష్ప: ది రూల్‌', 'కల్కి 2898 AD', 'దేవర', 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు.