కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రామిసింగ్ హీరోయిన్స్ లో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. నిజానికి ఈమె తెలుగు హీరోయినే అయినా తమిళంలోనే ఈమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ప్రెజెంట్ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఉన్నా కూడా తెలుగులో ఈ ముద్దుగుమ్మ కి అవకాశాలు ఏమాత్రం రావడం లేదు. తెలుగులో అడపా దడపా సినిమాల్లో నటించిన ఐశ్వర్య రాజేష్ కి సరైన స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. ఈమధ్య 'ఫర్హానా' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తెలుగులో సరైన అవకాశాలు లేకపోవడం వల్లే తను కోలీవుడ్లో సినిమాలు చేస్తున్నానని తెలిపింది.
ఇక తాజాగా చెన్నైలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ తాను ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. చాలామంది స్టార్ హీరోలు తనకు అవకాశం ఇవ్వలేదని, అందుకే తాను లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజా ఈవెంట్ లో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. " 'కాకా ముత్తై' సినిమా తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చింది. ఆ సినిమా చేసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నన్ను పిలిచి మరీ అభినందించింది. ఆ సమయంలో ఒక్కసారిగా నా చుట్టూ అంతా బాగానే జరుగుతుంది అని అనుకునే లోపే సినిమా అవకాశాలు రాకపోవడం నన్ను ఆశ్చర్యాన్ని కలిగించింది. దాదాపు రెండు సంవత్సరాలు నాకు ఎటువంటి అవకాశాలు రాలేదని తెలిపింది.
"నా కెరీర్ చూసుకుంటే ధనుష్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, దుల్కర్ సల్మాన్ లాంటివారు తప్ప మిగతా స్టార్ హీరోలు నాకు వారి సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. హీరో హీరోయిన్ కి మధ్య ఒక నిష్పత్తి ఉంది. మార్కెట్ విలువ, శాటిలైట్, ఓటీటీ, డిజిటల్ విలువ ఇలా అన్ని లెక్కలేసుకొని హీరోయిన్ ని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో అన్నిట్లోనూ మనం ఆశించిన స్థాయిలో ఉండాలంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే నేను లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించాలని అనుకున్నాను. నేను ఇప్పటివరకు 15 లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశాను. కానీ ఈరోజుకి కూడా నాకు ఏ స్టార్ హీరో తన సినిమాలో అవకాశం ఇవ్వలేదు. అసలు ఎందుకు ఇవ్వడం లేదో కూడా తెలియదు. దాంతో నా సినిమాకు నేనే హీరోగా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. పెద్ద పెద్ద హీరోలతో స్టార్ హీరోలతో అవకాశాలు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకంటూ సొంత అభిమానులు ఉన్నారు" అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. దీంతో ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తెలుగులో ఐశ్వర్య రాజేష్ ఇప్పటి వరకు 'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీష్', 'రిపబ్లిక్' వంటి సినిమాల్లో నటించింది.
Also Read : ‘సలార్’ కంటే ముందే 'జూరాసిక్ పార్క్’ రిఫరెన్స్‌ను ఆ మూవీలో వాడేశారు? ఆ సినిమా పేరేంటి?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.