పాన్ ఇండియన్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు భారతీయ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేశారు.  ఈ టీజర్ అనుకున్న స్థాయిలో లేదనే విమర్శలు వచ్చినా, యూట్యూబ్ లో మాత్రం భారీగా వ్యూస్ అందుకుంది. 24 గంటల్లో ఏకంగా 83 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆల్ టైం హైగా రికార్డును నమోదు చేసింది.   


‘సలార్’పై వివేక్ అగ్నిహోత్రి విమర్శలు


అటు ఈ టీజర్ పై ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ రంజన్ అగ్ని హోత్రి పరోక్షంగా విమర్శలు చేశారు. రోజు రోజుకు మేకర్స్ సినిమాల్లో హింసను మరింత గ్లామరైజ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ‘సలార్’ ను విమర్శిస్తూ, టామ్ క్రూజ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ వన్’పై ప్రశంసలు కురిపించారు. “సినిమాలో  విపరీతమైన హింసను కొంత మంది ప్రతిభగా భావిస్తున్నారు. నటుడు కాని వ్యక్తిని గొప్ప ప్రతిభావంతుడిగా ప్రమోట్ చేస్తున్నారు” అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్ ను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. అటు టామ్ క్రూజ్  చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ వన్’  యాక్షన్ సీక్వెన్స్‌ మేకింగ్ వీడియోను షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించారు. అసాధారణమైనదే కాదు, అత్యంత వినూత్నమైనదిగా అభివర్ణించారు.  ఏదో ఒక రోజు భారతీయ సినిమా పరిశ్రమ కేవలం స్టార్ చిత్రాలను నిర్మించడంపై దృష్టి పెట్టకుండా, ఇలాంటి కంటెంట్‌ ఉన్న చిత్రాలను రూపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.










వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన  


భారతీయ సినిమాల్లో మేకర్స్ హింసను గ్లామర్ గా మార్చుతున్నారన్న వివేక్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన లభించింది. ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో తమరు చేసింది కూడా అదేకదా అంటూ కొంత మంది నెటిజన్లు విమర్శించారు. మరికొంత మంది ఆయన చేసిన కామెంట్స్ ఏ సినిమా గురించో వివరించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆయనకు మద్దతు పలికారు. కొత్త సినిమా తీరు బాగాలేదని మరికొంత చెప్పుకొచ్చారు.   


‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రంతో వివేక్ బిజీ


‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి, ప్రస్తుతం ‘ది వ్యాక్సీన్ వార్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, రైమా సేన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పల్లవి జోషి నిర్మించిన ఈ చిత్రం ఈ సంవత్సరం చివరలో దసరా కానుకగా విడుదల కానుంది. ఈ మూవీ 11 భాషలలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Read Also: రన్నింగ్ ట్రైన్‌పై అదిరిపోయే యాక్షన్ సీన్లు, 61 ఏళ్ల వయస్సులోనూ టామ్ క్రూజ్‌లో అదే ఎనర్జీ - మేకింగ్ సీన్స్ చూసేయండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial