ఒక్కోసారి కొంత మంది మాట్లాడే మాటలు తీవ్ర వివాదానికి కారణం అవుతాయి. తెలిసి మాట్లాడుతారో? తెలియక మాట్లాడుతారో? అర్థంకాదు గానీ, ఆ తర్వాత తల దించుకునే పరిస్థితి వస్తుంది. ఓసారి సీనియర్ నటుడు చలపతిరావు మహిళల గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితి కేసుల వరకు వెళ్లింది. తాజాగా తమిళ హాస్య నటుడు రోబో శంకర్ సైతం నటి హన్సికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శల పాలవుతున్నారు.


ఇంతకీ రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు ఏంటి?


రీసెంట్ గా చెన్నైలో ‘పార్ట్‌నర్’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో నటి హన్సిక గురించి రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనకు స్టేజి మీద మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు హన్సిక గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమె చూడ్డానికి మైనపు బొమ్మలా ఉంటుందని, ఆమె శరీరం మైదా పిండిలా ఉంటుందన్నారు. ఈ సినిమాలో హన్సికతో కలిసి నటించినప్పుడు జరిగిన విషయాలను వివరించే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమాలో ఒక సీన్‌లో నేను హన్సిక మోకాలి కింద చేతితో కొట్టాలి. కానీ, ఆమె అందుకు నో చెప్పింది. చివరకు నేను, దర్శకుడు ఆమె కాళ్ల మీద పడి కనీసం కాలి వేలు అయిన తాకాలి అనుకున్నాం. దానికి కూడా ఆమె అంగీకరించలేదు. కేవలం హీరో ఆదితో మాత్రమే రొమాంటిక్ సన్నివేశాల్లో పాల్గొంటానని చెప్పింది. అప్పుడు నాకు అర్థం అయ్యింది. హీరోగా ఉంటే కలిగే లాభాలు ఏంటో? అని” అన్నారు.  


రోబో శంకర్ దుమ్ము దులిపిన జర్నలిస్టు


రోబో శంకర్ హన్సిక గురించి చేసిన వ్యాఖ్యలను జర్నలిస్ట్ ఓట్రన్ దొరై తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి వ్యక్తులను అసలు స్టేజి మీదికే ఎక్కనివ్వకూడదని చెప్పారు. “స్టేజి మీద హన్సిక ఒక్కరే ఉన్నారు. ఆమెతో మర్యాదగా ప్రవర్తించాలి. కానీ, రోబో శంకర్ చెత్త కామెంట్స్ చేసి లిమిట్స్ క్రాస్ చేశారు. దయచేసి ఇలాంటి వారిని స్టేజి మీదకు ఎక్కనివ్వకూడదు. ఒక వేళ ఎక్కనిస్తే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలని చెప్పండి. నాలుగు గోడల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. కానీ, నలుగురిలో ఇలా అసభ్యంగా మాట్లాడ్డం మంచి పద్దతి కాదు. ఇలాంటి స్టేజి మీద మహిళల గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తారు. సోషల్ మీడియాలో ఎవరైనా హీరోయిన్ల గురించి తప్పుగా మాట్లాడితే ఇదేంటి? అని ఆశ్చర్యపోతారు. శంకర్ లాంటి వ్యక్తుల కారణంగానే హీరోయిన్లపై అడ్డగోలు కామెంట్స్ చేసే వారు పెరిగిపోతున్నారు” అంటూ ఓట్రన్ దొరై నిప్పులు చెరిగారు.   


క్షమాపణలు చెప్పిన జాన్ విజయ్


ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు జాన్ విజయ్, రోబో శంకర్ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. “సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశం గురించి ఆయన వివరించారు. కానీ, చెప్పే విధానం సరిగా లేదు. అందుకు సినిమా యూనిట్ తరఫున అందరికీ క్షమాపణలు చెప్తున్నాను” అన్నారు.   


Read Also: హింసను గ్లామరైజ్ చేస్తున్నారు - ‘సలార్’ టీజర్‌పై ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి పరోక్ష విమర్శలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial