Balakrishnas son Mokshagna Teja | బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన కొత్త సినిమా స్టిల్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్టిల్ తో భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు అభిమానులు. మోక్షు క్రేజ్ మామూలుగా లేదు. సినిమా విడుదలు ముందే బాలయ్య తనయుడిని పెద్ద స్టార్ ని చేసేశారు నందమూరి ఫ్యాన్స్. 






టాలీవుడ్ లో సినిమా రిలీజ్ టైమ్ లో అభిమాన హీరోకి కటౌట్లు పెట్టి పూలదండలు వేసి హంగామా చేస్తుంటారు ఫ్యాన్స్. కటౌట్లు అంటే సినిమా రిలీజ్ టైమ్ లోనే అనుకుంటాం. ఇటీవల టీజర్లు, ట్రైలర్ లాంచ్ టైమ్ లో కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు వేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సమయంలో కటౌట్లు కామన్ గా మారాయి. అయితే ఓ హీరో డెబ్యూ మూవీ స్టిల్ రిలీజ్ కాగానే కటౌట్లతో హంగామా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఆ క్రెడిట్ నందమూరి మోక్షజ్ఞకే దక్కింది. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. జస్ట్ ఓ స్టిల్ రిలీజ్ చేశారంతే. ఆ వెంటనే అభిమానులు కటౌట్లు కట్టి దండలు వేసి హంగామా మొదలు పెట్టారు. 


హనుమాన్‌ మూవీతో సూపర్‌ హిట్‌ కొట్టిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞను హీరోగా టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కూడా గెస్ట్ రోల్ లో కనపడతారని అంటున్నారు. మోక్షజ్ఞ బర్త్‌ డే కావడంతో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక్కడ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే విషయం మరోటి ఉంది. జూనియర్ ఎన్టీఆర్, మోక్షుకి వెల్కమ్ చెబుతూ ఓ ట్వీట్ వేశారు. తాతయ్య ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆకాంక్షిచారు. ఇంకేముంది నందమూరి అభిమానులు మరింత సంబరపడిపోతున్నారు. కొన్నాళ్లుగా బాబాయ్ బాలయ్యకి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మధ్య అంత సఖ్యత లేదనే పుకార్లు ఉన్నాయి. ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో కూడా హరికృష్ణ తనయులిద్దరూ ప్రచారం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఓ పోస్ట్ పెట్టలేదు.


అటు వైసీపీ తరపున బన్నీ, జనసేన తరపున రామ్ చరణ్ సహా ఇతర మెగా హీరోలు, జబర్దస్ట్ నటులు ఫీల్డ్ లోకి వచ్చి రచ్చ చేశారు. టీడీపీ తరపున మాత్రం నందమూరి ఫ్యామిలీ అంతా కలసి వచ్చినా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మిస్ అయ్యారు. దీంతో ఏదో జరుగుతోందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఎన్టీఆర్ ట్వీట్ తో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. తాత ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నా.. మోక్షజ్ఞకు కూడా అభిమానుల సపోర్ట్ బాగానే ఉంది. ముఖ్యంగా బాలయ్య అభిమానులంతా మోక్షు ఎంట్రీకోసం వెయిట్ చేస్తున్నారు. 


మోక్షజ్ఞ గతంలో కూడా చాలాసార్లు మీడియాలో కనపడ్డారు. ఆమధ్య తన బావ నారా లోకేష్ పాదయాత్రకు కూడా హాజరయ్యారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఈ కుర్రాడి లుక్స్ లో చాలా మార్పు వచ్చింది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఇప్పుడు సినిమాకోసం సిద్ధమయ్యాడు మోక్షు. అందులోనూ ఫస్ట్ లుక్ ఫొటో సూపర్ గా ఉంది. ప్రశాంత్ వర్మ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంది. అందుకే ఆ స్టిల్ తో నందమూరి అభిమానులు ఖుషీ అయిపోయారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక మోక్షు ఫస్ట్ మూవీ రిలీజ్ రోజు పూనకాలే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. 


Also Read: Mokshagna Teja: నందమూరి వారసుడొచ్చాడు... బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా అనౌన్స్ చేశారోచ్