Tejus Kancherla movie Uruku Patela review: ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ'తో కథానాయకుడిగా పరిచయమైన యువకుడు తేజస్ కంచర్ల. 'హుషారు'తో విజయం అందుకున్నారు. పాయల్ రాజ్‌పుత్ 'ఆర్‌డిఎక్స్ లవ్'లోనూ హీరోగా నటించారు. అయితే... ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. చిన్న గ్యాప్ తీసుకుని 'ఉరుకు పటేల' అంటూ ఈ రోజు థియేటర్లలోకి వచ్చారు. వినాయక చవితి సందర్భంగా నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? మ్యాటర్ ఏంటి? అనేది రివ్యూలో చూద్దాం. 


కథ (Uruku Patela Movie Story): ఊరి సర్పంచ్ రామరాజు (గోపరాజు రమణ) కుమారుడు పటేల (తేజస్ కంచర్ల). చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతని కోరిక. ఏడో తరగతిలో చదువు ఆపేసిన పటేలను పెళ్లి చేసుకోవడానికి ఆ ఊరి అమ్మాయిలే కాదు.... చుట్టుపక్కల గ్రామాల అమ్మాయిలు కూడా ముందుకు రారు. అటువంటి పరిస్థితిలో స్నేహితుడి పెళ్లిలో పరిచయమైన డాక్టర్ అక్షర (ఖుష్బూ చౌదరి) ప్రేమిస్తుంది.


పటేలను అక్షర ప్రేమించడానికి కారణం ఏమిటి? అక్షర అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఆమెను పెళ్లి చేసుకోనని పటేల ఎందుకు చెప్పాడు? అక్షయ పుట్టినరోజు నాడు ఆమె ఆస్పత్రికి వెళ్లిన పటేల ఎందుకు భయం పరుగులు తీశాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Uruku Patela Review Telugu): ఉరుకు పటేల... ఇదొక లవ్లీ ఎంటర్‌టైనర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్. ప్రచార చిత్రాల్లో ప్రేక్షకులకు చూపించినది కొంతే. ఈ కథలో అసలు విషయం, ఆ టైటిల్ వెనుక కహాని అంతా ఇంటర్వెల్ ముందు మొదలైంది. లవ్, కామెడీ సన్నివేశాలతో ఫస్టాఫ్ అలా అలా సరదాగా సాగితే... ఆ ఇంటర్వెల్ ముందు మెయిన్ ట్విస్ట్ రివీల్ చేసి సెకండాఫ్ మరో జానర్‌లో ముందుకు వెళుతుంది. చివరకు, మూఢ నమ్మకాల మీద సందేశం ఇస్తూ ముగించారు


'ఉరుకు పటేల' సినిమాకు తేజస్ కంచర్ల నటన, ఆయన క్యారెక్టరైజేషన్ బలంగా నిలిచాయి. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్, క్లైమాక్స్ ముందు మరొక ట్విస్ట్... ఆ రెండిటిని బేస్ చేసుకుని దర్శకుడు వివేక్ రెడ్డి కథ రాసుకున్నారు. ఆ రెండు ట్విస్టులు బాగున్నాయి. అయితే... మధ్యలోని సన్నివేశాల్లో అంత బలం లేదు. సాధారణ సన్నివేశాలను సైతం తనదైన నటనతో తేజస్ కంచర్ల నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన డైలాగుల్లో డబుల్ మీనింగ్ అక్కడక్కడ దొర్లినా నవ్వించాయి తప్ప విమర్శించేలా లేవు.


'ఉరుకు పటేల' కథకు బలహీనత వివేక్ రెడ్డి రచన. లవ్, ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్, ట్విస్ట్స్, కామెడీ... కథలో అన్నీ ఉన్నాయి. నటీనటులను చక్కగా ఎంపిక చేశారు. కానీ, చక్కటి సన్నివేశాలు రాసుకోవడంలో, తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యారు. కథలో మూఢ నమ్మకాలను పైపైన టచ్ చేశారు. అందువల్ల, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా చాలా సన్నివేశాలు నిస్సారంగా ముందుకు వెళ్లాయి. 'చమ్మక్' చంద్రను కొట్టడానికి కొంత మంది వస్తారు. ఎందుకు? ఏమిటి? అనేది క్లారిటీ ఉండదు. గోపరాజు రమణ వంటి ఆర్టిస్టును ఆయన సరిగా వాడుకోలేదు. ప్రవీణ్ లక్కరాజు పాటలు, స‌న్నీ కూర‌పాటి కెమెరా వర్క్ బావున్నాయి. నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు.


Also Read: 'ది గోట్' రివ్యూ: తండ్రి పాలిట కన్న కొడుకే విలన్ అయితే... విజయ్ సినిమా హిట్టా? ఫట్టా?



తేజస్ కంచర్ల హ్యాండ్సమ్ హీరో. లుక్స్ పరంగా బావుంటారు. 'ఉరుకు పటేల'లోనూ అందంగా కనిపించారు. ఫస్టాఫ్ అంతా తెలంగాణ యువకుడిగా స్వాగ్ చూపించారు. ఆయన ఎనర్జీకి తగ్గ సన్నివేశాలు వచ్చినప్పుడు హుషారుగా చేశారు. అయితే, తేజస్ కంచర్లకు ఇంటర్వెల్ తర్వాత నటన చూపించే అవకాశం వచ్చింది. టెన్షన్ చాలా చక్కగా చూపించారు. తన పాత్ర వరకు నటుడిగా న్యాయం చేశారు. ఖుష్బూ చౌదరి ఈ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అందంలో, నటనలో యువత మెచ్చేలా ఉన్నారు.


'మల్లేశం'తో పాటు పలు సినిమాల్లో హీరో హీరోయిన్లకు తండ్రిగా కనిపించిన ఆనంద చక్రపాణి... లుక్ పరంగా 'ఉరుకు పటేల'లో కొత్తగా ఉన్నారు. ఆయనను  వైవిధ్యంగా చూపించిన చిత్రమిది. గోపరాజు రమణ హీరో తండ్రిగా పర్వాలేదు. 'చమ్మక్' చంద్ర కామెడీ వర్కవుట్ కాలేదు. సుదర్శన్ కొన్ని సన్నివేశాల్లో నవించారు.  


హీరోగా, నటుడిగా తేజస్ కంచర్ల మరోసారి మెరిసిన సినిమా 'ఉరుకు పటేల'. ఆ పాత్రకు అవసరమైన స్వాగ్ చూపించారు. హుషారైన యువకుడి తాను పాత్రలకు పర్ఫెక్ట్ అని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు. తేజస్‌ నటనతో పాటు కొన్ని కామెడీ సన్నివేశాలు బావున్నాయి. కానీ, దర్శకుడు వివేక్ రెడ్డి డిజప్పాయింట్ చేశారు.


Also Readహీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?